నిజామాబాద్, డిసెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
2024 జనవరి 1 నాటికి 18 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న వారందరిని ఓటరు జాబితాలో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలింగ్ బూత్ వారీగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులతో కలిసి త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డిలతో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం పట్ల సీఈఓ జిల్లా కలెక్టర్లను అభినందించారు. ఇదే తరహాలో త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటినుండే అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులతో మాట్లాడుతూ, ఎస్‌ఎస్‌ఆర్-2024 లో భాగంగా వచ్చే జనవరి 01 వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న యువతీ, యువకులందరు ఓటర్లుగా నమోదయ్యేలా గట్టిగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం వచ్చే దరఖాస్తులను వెంటదివెంట పరిష్కరించాలని, జనవరి 06 వ తేదీన డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఆ తరువాత కూడా ఏవైనా మార్పులు, చేర్పులకు సంబంధించి జనవరి 22 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుందని అన్నారు. వచ్చిన దరఖాస్తులను 2024 ఫిబ్రవరి 2 వ తేదీ వరకు పరిశీలన పూర్తి చేసి, ఫిబ్రవరి 08 న తుది ఓటరు జాబితాను వెలువరించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాలో ఏవైనా లోటుపాట్లు ఉంటే సవరించుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్లు తొలగించిన వాటి విషయంలో సమగ్రంగా ఇంటింటి సర్వే చేపట్టి పరిశీలన జరిపించాలని, డూప్లికేషన్ లు లేకుండా చూడాలని, 100 సంవత్సరాలు దాటిన ఓటర్ల వివరాలను మరోమారు సమగ్రంగా పరిశీలించాలని అన్నారు.
ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ఇంకనూ ఎక్కడైనా కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ముఖ్యంగా 1450 పైచిలుకు ఓటర్లు కలిగిన చోట కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రతిపాదించాలని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తూ, అందుకు గల కారణాలను అన్వేషించాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఆర్డీఓలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, వినోద్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.