కామారెడ్డి, డిసెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఓటరు జాబితా సవరణ-2024లో భాగంగా జిల్లాలలో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ 2024లో భాగంగా ఆయా జిల్లాలలో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను ఫారం 6 ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు. సవరణలు, మార్పుల కొరకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, మరణించిన వారి వివరాలు తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నోటీసులు జారీచేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ స్థాయి అధికారులతో ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తులు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రాల ప్రదేశాల మార్పులు, వివాదాలతో కూడిన సమస్యాత్మక కేంద్రాల వివరాలతో నివేదిక అందించాలని తెలిపారు. ఓటరు జాబితా రూపొందించడంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకోవాలని, 1500 మంది ఓటర్ల సంఖ్య దాటినచోట నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనల నివేదిక అందించాలని తెలిపారు.
సమీక్షలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, కామారెడ్డి ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, తహసిల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.