నిజామాబాద్, డిసెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ నగర అభివృద్ధిపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా నగరంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, ఆయా నిధులతో కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాల గురించి కమిషనర్ ఎం.మకరంద్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు పూర్తి సహకారం అందించాలని అన్నారు. ఇటీవలే తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించిన సందర్భంగా ప్రజల నుండి విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, ఉద్యానవనాలు, ఐలాండ్స్, బస్తీ దవాఖానాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి మౌలిక వసతులకు సంబంధించి అనేకమంది విజ్ఞాపనలు చేశారని శాసనసభ్యులు ధన్పాల్ తెలిపారు.
తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు రానున్న ఐదేళ్ల కాలం పాటు స్థానికంగానే అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఎమ్మెల్యే తన సంకల్పాన్ని వెల్లడిరచారు. అధికారుల సహకారం ఉన్నప్పుడే ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు వీలవుతుందని, ఈమేరకు అన్ని శాఖల అధికారులు తోడ్పాటును అందించాలని సూచించారు.
క్రమం తప్పకుండా సమీక్షలు జరుపుతూ నగర అభివృద్ధికి బాటలు వేస్తానని అన్నారు. ప్రజల నుండి వచ్చే సమస్యలు, వినతులపై తక్షణమే స్పందిస్తూ, నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, ట్రాన్స్కో ఎస్.ఈ రవీందర్, డీ.ఈ.ఓ దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.