ఆర్మూర్, డిసెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ సబ్ డివిజన్ తపాల శాఖ ఏఐజీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్ ముందు 18 సబ్ పోస్టాఫీసుల పరిధిలో పని చేస్తున్న బీపీఎంలు, ఏబీపీఎంల నిరవధిక సమ్మె గురువారంతో 3 వ రోజుకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు తమ డిమాండ్ల సాధన కొరకు నిరవధిక సమ్మెను ఉదృతం చేస్తున్నామని, రాష్ట్ర నాయకులు లింబాగౌడ్, సబ్ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర నాయకులు లింబాగౌడ్ మాట్లాడుతూ… గ్రామీణ తపాల ఉద్యోగులమైన మేము చాలీచాలని జీతంతో తపాల శాఖలో అనేక సంవత్సరాల నుండి సేవలందిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలతో మమేకమై నూతన అకౌంట్లు ఓపెన్ చేస్తూ ప్రమాద బీమాలాంటి కొత్త స్కీములను ప్రజలకు ప్రచారంచేస్తూ ప్రతీ నెల గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్లు పంపిణీ చేస్తూ పై నుండి ఇచ్చిన టార్గెట్లను సకాలంలో పూర్తి చేస్తూ అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న మాకు పనికి తగిన వేతనంలేక జీతం తక్కువ పనిభారం ఎక్కువై అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామన్నారు.
వెట్టి చాకిరీ బతుకులకు విముక్తి కలగాలని ఈ నిరవధిక సమ్మె చేస్తున్నామని,కేంద్ర ప్రభుత్వం తమ విధి నిర్వహణ సమయం 8 గంటలకు పెంచి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. నూతన పీఆర్సీలో రెగ్యులర్ స్కేల్ వర్తింపజేస్తూ, రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ పెన్షన్, గ్రాట్యువిటీ, కమిటేషన్ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలన్నారు.
జీడీఎస్‌లు మొబైల్ ఫోన్లతో విధులు నిర్వహిస్తూ టార్గెట్లు పూర్తి చేస్తున్నామని, భవిష్యత్తులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా స్లాట్ పాయింట్లను అనుసరింపజేయాలని, తపాల సేవలను మరింత విస్తృతం చేయడానికి ఆర్‌ఐసిటి డివైజ్ లను ఉపసంహరించి, లాప్టాప్ లు, ప్రింటర్స్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లకు ఇవ్వాలన్నారు. పెయిడ్ లీవులు 180 వరకు జమ చేసుకొని నగదు పొందే సౌకర్యం ఏర్పాటు చేయాలని, జీడీఎస్‌ల డిమాండ్లు సాధించే వరకు ఈ నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమ్మెతో మా ఐక్యత చాటుకొని మా సమస్యలకు తగిన పరిష్కారం లభించే వరకు మా డిమాండ్ల సాధనలో నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మంథని బీపీఎం లింబాగౌడ్, సబ్ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో బీపీఎంలు శ్రీనివాస్, శ్రీకాంత్, వేంకటేష్, రవీంధర్, జగదీష్, వేణు గోపాల్, అభిరాం, భూపతి, గంగాధర్, గంగముత్యం, శ్రీనివాస్, భావన, శ్వేత, లక్ష్మి,దాత్రిక్, రవళి, ఏబీపీఎంలు రాజేష్, భూషన్, రాము, మృదుల, తేజశ్విని, రుతిక, శ్రీకావ్య, శోభ, లక్ష్మి, బాషీద్ సుదర్శన్, సూరజ్, పవన్, సాయన్న, సమీ, అఫీజ్, భూమన్న, ఫస్లొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.