బాన్సువాడ, డిసెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పుట్టిన గడ్డపై మమకారంతో తాము సంపాదించిన దాంట్లో కొంత పేద ప్రజలకు సాయం చేయడం ఎంతో అభినందనీయమని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో ఆట సహకారంతో జనహిత సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంచినీటి శుద్ధి యంత్రాన్ని, ఈసీజీ యంత్రాన్ని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో మంచినీటి శుద్ధి యంత్రాన్ని ఈసీజీ యంత్రాన్ని ఏర్పాటు చేసిన ఆట సభ్యులకు జనహిత సంస్థ నిర్వాహలకు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. మంచినీటి శుద్ధి యంత్రం ఏర్పాటుతో రోగులకు రోగి సహాయకులకు స్వచ్ఛమైన మంచినీరు అందుతుందని, ఆస్పత్రికి వచ్చే పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
తాను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మించడం జరిగిందని, రాష్ట్ర ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడంతో పాటు గర్భిణీ మహిళలకు అందుబాటులో ఉండడానికి 20 కోట్లతో వంద పడకల మాతా శిశు ఆసుపత్రిని నిర్మించి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చానన్నారు. తల్లిపాల ప్రోత్సాహంలో బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రికి దేశంలోనే అవార్డు పొందిన ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి మన బాన్సువాడ ఆసుపత్రి అని, కాయకల్ప అవార్డు ఐదుసార్లు, లక్ష్య అవార్డు రెండుసార్లు రావడానికి కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో వాతావరణం సిబ్బంది సేవలు డాక్టర్లు చేసిన కృషి కారణమన్నారు.
మాతా శిశు ఆసుపత్రి ఏరియా ఆసుపత్రికి అనుసంధానం చేస్తూ రోగులకు వారి సహాయకులకు సౌకర్యం కోసం ప్రత్యేకంగా స్టీల్ వంతెన నిర్మించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆట వేడుకల చైర్మన్ జయంత్ చల్ల, కార్యదర్శి రామకృష్ణారెడ్డి, దాతలు హిమబిందు రెడ్డి, బోడ అశ్విన్ రెడ్డి, జనహిత సంస్థ నిర్వాహకులు సతీష్ రెడ్డి రఘుపతి రెడ్డి, ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస ప్రసాద్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి,వైస్ చైర్మన్ జుబేర్, కౌన్సిలర్లు బాడీ శ్రీనివాస్, లింగమేశ్వర్, అమీర్ చావుస్, కిరణ్, వెంకటేష్, రమాదేవి రాజా గౌడ్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.