కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్‌ సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని శనివారం నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలంలోని లక్కోర గ్రామం నుండి శ్రీకారం చుట్టారు. స్థానిక జిల్లా పరిషత్‌ ప్రభుత్వ సెకండరీ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్లమెంట్‌ సభ్యులు అరవింద్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి సంకల్ప యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో గల చదువుల తల్లి సరస్వతీ మాత విగ్రహానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్దతో పూజించారు.

కాగా, జిల్లాలోని మొత్తం 530 గ్రామ పంచాయతీల పరిధిలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక వాహనాలను సమకూరుస్తూ, 7 బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతీ రోజు ఒక్కో బృందం రెండు నుండి మూడు గ్రామాలలో సంకల్ప యాత్ర ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్యపర్చేలా నిర్విరామంగా ఈ కార్యక్రమం యాభై రోజులకు పైగా కొనసాగేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది.

ఇందులో భాగంగా శనివారం లక్కోర గ్రామం నుండి శ్రీకారం చుట్టిన సంకల్ప యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎం.పీ అరవింద్‌తో పాటు అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్లమెంట్‌ సభ్యులు అరవింద్‌ మాట్లాడుతూ, అర్హత కలిగిన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కింద సహాయం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. 17 రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి లిమిట్‌ లేకుండా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి, భారతీయ పౌరసత్వం కలిగిన ప్రతి పౌరుడికీ కేంద్ర పథకాలు అందాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఈ దిశగా జిల్లాలో చేపట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని గ్రామగ్రామాన విజయవంతం చేస్తూ, అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఉజ్వల భారత్‌, సుకన్య సమృద్ధి యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, ముద్రా యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన వంటి పథకాల కింద అర్హత కలిగిన వారు సంకల్ప యాత్ర సందర్భంగా దరఖాస్తులు చేసుకోవచ్చని, తరువాత కూడా పంచాయతీ కార్యదర్శులను సంప్రదించి దరఖాస్తులు అందించవచ్చని సూచించారు.

కాగా, వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమం కింద ప్రతి పంచాయతీకి ప్రత్యేక వాహనంతో కూడిన బృందాలను పంపి 17 రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నామని అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు గ్యాస్‌ కనెక్షన్లు, భూసార పరీక్షా ఫలితాల నిర్ధారణ కార్డులను వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర సందర్భంగా పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్‌ భారత్‌, ఉజ్వల భారత్‌, ఐసిడిఎస్‌ స్టాల్స్‌ లను ఎం.పీ పరిశీలించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందిన పలువురు లబ్ధిదారులు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాల గురించి అధికారులు అవగాహన కల్పించారు. ముఖ్యంగా నానో ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వ్యవసాయ అధికారులు నొక్కి చెప్పారు. అంతకుముందు వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రను వర్చువల్‌ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తన సందేశాన్ని అందించారు. పాఠశాలకు చెందిన విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరింపజేశారు.

కార్యక్రమంలో డీఆర్డీఓ చందర్‌ నాయక్‌, డీపీఓ జయసుధ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రావు, డీఈఓ దుర్గాప్రసాద్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శనం, డీఐఈఓ రఘురాజ్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్‌ హుస్సేన్‌, నాబార్డు డీ.డీ.ఎం ప్రవీణ్‌, ఆర్‌ డబ్ల్యూ ఎస్‌ ఈఈ రాకేష్‌, డీఎల్పీఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ నాగార్జున, సర్పంచ్‌ వంశీకృష్ణ, ఎంపీటీసీ గంగామణి, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »