కామారెడ్డి, డిసెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మారుతున్న సీజనకు అనుగుణంగా పంటల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో పాడిపశువుల విషయంలోనూ అన్నే జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి సింహారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా శీతాకాలంలో పశువులు మేతమేయడానికి అంత ఆసక్తి చూపవని దీని వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుందని అందుకే పశువులకు అందించే దాణా విషయంలో మార్పులు చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా చలిలో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలను ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పితకడం మంచిదని తెలిపారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటుందని, పశువుల శరీరం వేడిగా ఉంచేందుకు అవసరమైన ఆహారాన్ని సమీపంలోని పశువైద్యుని సలహాతో అందించాలని, లేకుంటే పశువులు మేత సరిగా తినక పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు.
చలికాలంలో దోమ కాటు, ఇతర వైరస్ల వ్యాప్తి వల్ల గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఆరుబయట పశువులను ఉంచిన షెడ్ల చుట్టూ వెచ్చగా ఉండేందుకు గోనెసంచులు కట్టాలన్నారు. వెటర్నరీ డాక్టర్ల సూచన మేరకు పశుదాణాలో పోషక విలువలు, మాంసకృత్తులు, శక్తిని ఇచ్చే పదార్థాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు.చలిగా ఉండే ఉదయం, రాత్రివేళల్లో పశువులకు ఎండుగడ్డి, పొడి దాణాను, ఉదయం 11 గంటల ప్రాంతంలో పచ్చగాడఫిని అందించాలన్నారు.
అలాగే పదువులకు నీటి టోట్టేలి గోరువెచ్చని నీటిని అందించాలని, నీటిని తొట్టిలోన ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలన్నారు. చలికాలంలో పశువులకు గాలి కుంటు వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని ముందుగానే ఈ వ్యాధికి సంబంధించిన టీకాను వేయించాలన్నారు. పాలు ఎక్కువగా ఇచ్చే పశువులకు మరిన్ని పోషకాలతో కూడిన దాణాను అందించాలని పశు వైద్యాధికారి సింహరావు తెలిపారు.