అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాల ఫలాలు అట్టడుగు వర్గాల వారికి అందేలా కృషి చేయాలని భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్‌ శ్రీవాత్సవ అన్నారు. అర్హులైన వారు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకున్నప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరి ఆయా పథకాలకు సార్థకత చేకూరుతుందని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా చేపట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రకు నిజామాబాద్‌ జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. ఆదివారం మోపాల్‌ మండలం కంజర, డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌ పల్లి గ్రామాలలో కొనసాగిన సంకల్ప యాత్ర కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగస్వాములయ్యారు. భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్‌ శ్రీవాత్సవ్‌, ఐ.ఏ.ఎస్‌ ముఖ్య అతిథిగా విచ్చేయగా, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా తదితర అధికారులు పాల్గొన్నారు.

ఆయా వర్గాల వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చాలని ప్రధాన లక్ష్యంతో భారత ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను నిర్వహిస్తోందని ముఖ్య అతిథి శ్రీవాత్సవ తెలిపారు. పేద ప్రజలకు మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, ఆర్థిక సహాయం, ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్లు, పక్కా ఇండ్లు, ఆహార భద్రత, పౌష్టికాహారం, వైద్యం, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య అందించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, అర్హులైన లబ్ధిదారులు వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జిల్లాలో విజయవంతంగా వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా అన్నారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, సంకల్ప యాత్రను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా గ్రామ, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు.

ఈ కమిటీలలో ఆయా శాఖల జిల్లా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, పాఠశాల హెడ్మాస్టర్లు, ఆశ వర్కర్లు తదితరులంతా క్షేత్రస్థాయిలో భాగస్వాములై వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ముందుకు తీసుకువెళ్లేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సంకల్ప యాత్ర సందర్భంగా అర్హత కలిగిన వారికి ఆయా పథకాల కింద లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయుష్మాన్‌ భారత్‌- పి ఎం జె ఏ వై, పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన, దీన్‌ దయాల్‌ అంత్యోదయ యోజన, పీఎం ఆవాస్‌ యోజన, పీఎం ఉజ్వల యోజన, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌, పీఎం పోషణ అభియాన్‌, హర్‌ ఘర్‌ జల్‌ – జల్‌ జీవన్‌ మిషన్‌, సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైస్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజెస్‌ ఏరియాస్‌, జన్‌ దన్‌ యోజన, జీవన్‌ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన, నానో ఫెర్టిలైజర్‌, ముద్ర యోజన తదితర పథకాల గురించి సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.

వివిధ పథకాల కింద దరఖాస్తులు సైతం స్వీకరించారు. ఇప్పటికే కేంద్ర పథకాల ద్వారా ప్రయోజనం పొందిన పలువురు లబ్ధిదారులతో మాట్లాడిరచారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలు, గోడప్రతులు, క్యాలెండర్లను ఆవిష్కరించి, ప్రజలకు పంపిణీ చేశారు. ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు.

సంకల్ప యాత్ర కార్యక్రమాలలో జెడ్పి సీఈఓ గోవింద్‌, డీఆర్డీఓ చందర్‌, డీపీఓ జయసుధ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డీ రమేష్‌, ఎన్‌ వై కె కో-ఆర్డినేటర్‌ శైలి బెల్లాల్‌, డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, సర్పంచ్‌ నర్సయ్య, ఎంపీటీసీ సౌమ్య, ఎంపిడిఓ గోపి, మోపాల్‌ ఎంపీఓ ఇక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »