కలెక్టరేట్‌ దేవాలయం, అధికారులు దేవుళ్ళు…

కామారెడ్డి, డిసెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపరచి రాష్ట్రం, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుటలో అధికారులు నిబద్దతగా చిత్తశుద్దితో పనిచేయాలని, తన వంతు పూర్తి సహకారమందిస్తానని కామారెడ్డి శాసనసభ్యలు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో అవినీతిరహిత పారదర్శక పాలన అందించాలన్నదే తన లక్ష్యమని అన్నారు.

సోమవారం కలెక్టరేట్‌ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి సమావేశంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి మాట్లాడుతూ కలెక్టరేట్‌ దేవాలయం, అధికారులు దేవుళ్ళ లాంటివారని ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ప్రజలకు సేవ బీచేసే భాగ్యం కల్పించిన ప్రభుత్వ ఆశయాలకనుగుణంగా పనిచేయాలని అన్నారు.

మనం ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించామని, ఆ కష్టాలను గుర్తెరిగి , నా వల్ల ఎవరు నష్టపోరాదనే భావనతో భవిష్యత్తు తరాల కోసం పనిచేయాలని, గతం తిరగేస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయన్న ఆత్మ సంతృప్తి కలగాలని హితవు పలికారు. విధి నిర్వహణలో కొన్ని ఒత్తిడులు వచ్చినా నిబంధనల మేరకు పనిచేయాలని, ఒకరిపై నిందారోపణలు చేయరాదని, మన వ్యక్తిత్వం మంచిగా ఉండాలన్నారు. పరిపాలన శక్తివంతంగా ఉండాలని, విధి నిర్వహణ మానవతా దృక్పథం, నిజాయితీ కలిగి ఉండాలని సూచించారు.

తనకు వ్యవస్థపై గౌరవం ఉందని, జనానికి ఉపయోగపడే సమస్యల గురించి మాత్రమే అధికారులను అడుగుతానని, అధికారులు కూడా అంతే నిజాయితీగా స్పందిస్తూ వాస్తవాలను తెలపాలని కోరారు. నియోజక వర్గానికి సంబంధించి ఏ విషమైన సానుకూల దృక్పధంతో తననుకలవచ్చని, లేదా ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల ద్వారా అమలు పరుస్తున్న కార్యక్రమాలు, ప్రగతిలో ఉన్న పనులు, వివరాలను శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. త్వరలో శాఖల వారీగా విడివిడిగా సమీక్షిస్తానని అన్నారు.

జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడుతూ జిల్లా అధికారులు మంచి సమర్ధులని, తమ శాఖల ద్వారా కేటాయించిన లక్ష్య సాధనలో బాగా కృషి చేస్తున్నారన్నారు. పనుల నిర్వహణలో ప్రజాప్రతినిధులకు సమాచారమందిస్తూ వారి సలహాలు, సూచనలు స్వీకరించడంతో పాటు పూర్తి సహకారమందిస్తారన్నారు. ఈ సందర్భంగా డిఆర్‌ డిఓ . మెప్మా, పంచాయతీ రాజ్‌, మిషన్‌ భగీరథ, నీటిపారుదల, విద్యుత్‌, వైద్యం, విద్య, సంక్షేమ శాఖలు, ఆర్‌ అండ్‌ బి, , పౌర సరఫరాలు, మున్సిపాలిటీ, అటవీ, లీగల్‌ మెట్రాలజీ, వ్యవసాయం, పశుసంవర్ధకం, ,సెరికల్చర్‌, ఆర్‌.టి.సి, అగ్నిమాపకం, తదితర శాఖల ద్వారా అమలు పరుస్తున్న కార్యక్రమాలు, వాటి ప్రగతిని శానసభ్యులకు వివరించారు.

ఈ ఖరీఫ్‌ లో 4 కోట్ల 43 లక్షల ధాన్యం సేకరించామన్నారు. 5500 మంది వీధి వ్యాపారులకు మూడు దఫాలుగా 10 వేలు, 20 వేలు, 50 వేళా చొప్పున ఆర్ధిక సహాయం అందజేసి దేశంలో అగ్రస్థానంలో నిలిచామని కలెక్టర్‌ వివరించారు. మహాలక్ష్మి పధకం పట్ల మహిళల నుండి అపూర్వ స్పందన లభిస్తున్నదని , ఆర్‌.టి.సి. బస్టాండ్‌ కిటకిట లాడుతున్నాయని అన్నారు. కామారెడ్డి మునిసిపాలిటీల్లో బహిరంగ ప్రదేశాలు ఎక్కడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. కామారెడ్డి పట్టణంలో రెండు రైల్వే వంతెనలు, 10 బ్రిడ్జిల నిర్మాణ ఆవశ్యకేత కలదని వివరించారు.

ఈ సందర్భంగా అధికారులు శానసభ్యలను పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానించారు. అంతకుముందు శాసనసభ్యులు వెంకట రమణారెడ్డి దంపతులు సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని దర్శించుకున్నారు. సమావేశంలో ఆర్‌.డి.ఓ. శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా అధికారులు, డివిజనల్‌ స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »