నందిపేట్, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నియోజకవర్గ ప్రజలు తనను రెండు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపిన ప్రజల సమస్యలు క్షేత్ర స్థాయిలో తెలుసుకొని, అధికారులతో మాట్లాడి వెను వెంటనే పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో వుంటు వారి సమస్యల కొరకు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పియూసి చైర్మన్, ఆర్మూర్ ఎంఎల్‌ఏ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
నందిపేట్ మండల కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన రైతు వేదికను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల పరంగా పురోగతి నివేదిక విని అధికారులకు దిశ నిర్దేశం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరిని ఆదుకుంటున్నాయని అన్నారు. దీనిని ఓర్వలేని ప్రతిపక్షాలు నోరుజారుతున్నాయన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఈ సంక్షేమం ఉందా అని ప్రశ్నించారు. ఏమి అభివృద్ధి చేయని ఎంపీ అరవింద్ నోరు పారేసుకుంటు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ సిగ్గు లేకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారని ధ్వజ మెత్తారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి తమతో అభివృద్ధిలో పోటీ పడాలన్నారు.
రాష్ట్రంలో అన్ని పదవుల్లో టీఆర్‌ఎస్ పార్టీ వారే ఉన్నారని పట్టుమని కంటికి కానరానంత దూరంలో ఉన్న మీ నాయకులు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పనికి మాలిన మాటలు చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారని రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలను పాతాళ లోకాలకు తొక్కేస్తారన్నారు.