కామారెడ్డి, డిసెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, నిరుద్యోగులు చేసిన పోరాటాల ఫలితంగానే బిఆర్‌ఎస్ ప్రభుత్వం పతనమైందని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని భావించిన, ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల కన్నీళ్లకు కారణమైన బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం జరిగిందని అన్నారు.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతుందన్న నమ్మకం ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా పెండిరగ్లో ఉన్న 3500 కోట్ల ఫీజుబకాయలను, యూనివర్సిటీలలో అధ్యాపకుల నియామకాన్ని,రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తొందరగా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 61 సంవత్సరాలకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెంచడం జరిగిందని, దీనివల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని, వయోపరిమితి విషయాన్నీ కూడా సమీక్షంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్, రాజు, నవీన్, సప్న, సరిత స్వప్న సరస్వతి, నవనీత్, అశ్వక్ పాల్గొన్నారు.