కామారెడ్డి, డిసెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మహాలక్ష్మి పధకానికి మహిళల నుండి అపూర్వ స్పందన లభిస్తున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గతంలో ప్రతిరోజు ఒక లక్షా 20 వేల మంది వరకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తుండగా ఈ నెల 9 నుండి ప్రారంభమైన మహాలక్ష్మి పధకం వల్ల ఆ సంఖ్య సుమారు రెండు లక్షల వరకు పెరిగిందని, ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికుల ఆక్యుపెన్సీ 63 శాతం ఉందని అన్నారు.
బుధవారం కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మహిళలతో రద్దీగా కిటకిటలాడుతున్న ప్రయాణ ప్రాంగణాన్ని, ప్లాట్ ఫారాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మహిళలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల విద్యార్థినిలకు మండల, జిల్లా కేంద్రాలకు బస్ లలో ఉచిత ప్రయాణం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సు సర్వీసులు నడపాలని సూచించారు. కాగా రద్దీ ఎంతో సునిశితమైన అంశమని బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఒత్తిడులను సమన్వయంతో అధిగమించాలన్నారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణం కొనసాగించేలా వారికి సహకరించాలని కలెక్టర్ సూచించారు.
అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళల భద్రతకు తగు ఏర్పాట్లు చేయాలని, రద్దీకి అనుకుగుణంగా అవసరమైతే పోలీస్ రక్షణ కల్పిస్తామని, ప్లాట్ ఫారాలు శుభ్రంగా ఉంచాలన్నారు. వారికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరకు సూచించగా మంచినీటి సౌకర్యం, పెయిడ్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయని, అదనంగా ఉచిత టాయిలెట్ బ్లాక్స్ , డ్రైనేజి ఏర్పాటు చేయవలసి ఉందని తెలుపగా మునిసిపల్ అధికారుల ద్వారా పనులు చేయిస్తానని తెలిపారు.
జీరో టికెట్ ఇస్తున్న విధానాన్ని కండక్టర్ ని అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ అధికారులు అందిస్తున్న సేవలు, ఉచిత ప్రయాణం పై మహిళా ప్రయాణికులను అభిప్రాయం అడుగగా పల్లె వెలుగు బస్సులతో పాటు ఎక్స్ ప్రెస్ ప్రెస్ బస్సుల సంఖ్య పెంచితె బాగుంటుందని తెలిపారు.
ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిర మాట్లాడుతూ మహాలక్ష్మి పధకం ప్రవేశపెట్టిన తరువాత ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయని, మధ్యాన్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు రద్దీ ఎక్కువగా ఉంటున్నదని అన్నారు. ఈ నెల 9 నుండి 19 వరకు కామారెడ్డి డిపో నుండి 6,82,887 మంది ప్రయాణికులు ప్రయాణించగా అందులో మహిళలే 4,29,812 మంది ఉన్నారని, సరాసరి 63 శాతం ఆకుపెన్సీ వారితో నిండిపోతున్నదని, 37 శాతం పురుషులుంటున్నారని అన్నారు.
మొదటి రోజు 30 శాతం, రెండవ రోజు 57 శాతం వినియోగించుకోగా, ఆ తరువాత ప్రతిరోజు 65 నుండి 68 శాతం మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.