మాచారెడ్డి, డిసెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి ఎంపీపీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి… తనపై పోలీసులకు, కలెక్టర్‌కి అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేశారని దాడి చేయించారు. పాల్వంచ మండలం మంథని దేవుని పల్లి గ్రామానికి చెందిన మంథని రాజు ఇంటిపై తన అనుచరులతో ఎంపీపీ నర్సింగరావు దాడి చేయించారు.
తన పంట పొలం వద్ద కేబుల్ వైర్లు కట్ చేసి పంపు మోటార్లను ధ్వంసం చేసి అతని ఇంటిపై దాడి చేసి, మోటార్ సైకిల్ ధ్వంసం చేయడంతో పాటు అతని ఇంటికి బయటి నుండి గడియ పెట్టి నానా హంగామా చేశారు. కేసు వాపస్ తీసుకోకపోతే నిన్ను ఇంట్లో వేసి తగలబెడతామని హెచ్చరించారు.
బుధవారం పాల్వంచ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ రమేశ్ గౌడ్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి అతని వెంబటే తీసుకువెళ్లి ఇతనికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ, ఎంపీపీ నర్సింగ్ రావు ద్వారా రాజుకు ప్రాణహాని ఉందని ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు. టిఆర్‌ఎస్ పార్టీ నాయకుల దౌర్జన్యానికి పోలీసులు ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకోకుంటే రేపటినుండి గ్రామస్తులతో కలిసి, ఈ విషయాన్ని మాజీ మంత్రి షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అతని శిక్షించే వరకు పోరాటం చేస్తామని అలాగే అతని క్వారీని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.