నిజామాబాద్, డిసెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం డిచ్పల్లిలోని సీ.ఎం.సీ మెడికల్ కళాశాలను పరిశీలించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి ఈ కళాశాలలో అనువుగా ఉన్న గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు, కోరుట్ల, జగిత్యాల శాసనసభ సెగ్మెంట్లు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోంది. మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో జరిగే పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహించాల్సి ఉన్నందున అందుకు అనుగుణంగా కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్ లు, రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, అదనపు డీసీపీ ఎస్.జయరాం లతో కలిసి కలెక్టర్ పరిశీలన జరిపారు.
ఇదివరకు 2019 పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సైతం సీ.ఎం.సీ కళాశాలలోనే నిర్వహించిన విషయం విదితమే. ఆ సమయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిన తీరుతెన్నుల గురించి కలెక్టర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీ.ఎం.సీ కి భవన సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మ్యాప్ ను పరిశీలించి ప్రస్తుతం కౌంటింగ్ నిర్వహణకు ఏమేరకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నది పరిశీలించారు.
ఈ భవన సముదాయం వినియోగంలో లేని కారణంగా అక్కడక్కడా నిర్వహణాపరమైన లోపాలు ఉండడాన్ని గమనించిన కలెక్టర్, అవసరమైన చోట మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా నిర్వహించేందుకు సీ.ఎం.సీ భవన సముదాయం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందా, లేదా అన్నది మరింత సమగ్రంగా పరిశీలన జరపాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్, మెప్మా పీ.డీ రాజేందర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు వేణు, పవన్, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గ కేంద్రాల అధికారులు తదితరులు ఉన్నారు.