కామారెడ్డి, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ ఖర్చుల వివరాలను డిసెంబర్ 29న ఎక్స్పెండిచర్ అబ్జర్వర్‌కు అందజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు సమర్పించవలసిన ఖర్చుల వివరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. షెడ్యూల్లో ఒకటి నుంచి 11 లోపు పేర్కొన్న ఖర్చుల వివరాలు సరిచూసుకొని, సమగ్రంగా తెలియజేయాలని సూచించారు.
రిజిస్టర్ ఉపయోగించి రోజువారి ఖర్చుల వివరాలు తెలియజేయాలని కోరారు. అభ్యర్థులు ఖర్చుల వివరాలు గడువులోగా ఇవ్వకపోతే మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారని తెలిపారు. బ్యానర్స్, పోస్టర్స్, దినపత్రికలు, టీవీ ఛానల్ లో ఇచ్చిన యాడ్స్ వివరాలు, వాటికైనా ఖర్చుల వివరాలు తెలియజేయాలని సూచించారు. ప్రచారం కోసం రాజకీయ పార్టీ నుంచి వచ్చిన డబ్బుల వివరాలు, అభ్యర్థి తాను పెట్టిన ఖర్చు వివరాలు వంద రూపాయల నోటరీ సంతకంతో ఉన్న అప్డవిట్ సమర్పించవలసి ఉంటుందని చెప్పారు.
స్టార్ క్యాంపెనర్ సమావేశానికి వచ్చినప్పుడు అభ్యర్థులు ఎంతమంది ఉంటే వారి ఖాతాలో ఖర్చుల వివరాలు సమానంగా రాయవలసి ఉంటుందని చెప్పారు. లౌడ్ స్పీకర్స్, కటౌట్స్, ఫర్నిచర్ కు చేసిన ఖర్చుల వివరాలు తెలియజేయాలని చెప్పారు. ప్రచారం, ప్రకటనలు, వాహనాల ఖర్చు, ప్రచార సభల ఖర్చుల బిల్లులు చూపించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జనవరి రెండులోగా అభ్యర్థులు బిల్లుల వివరాలు పూర్తిగా అందజేయాలని చెప్పారు. అభ్యర్థుల ఖర్చులు సమర్పించడానికి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. సరిjైున వివరాలు ఇవ్వని అభ్యర్థులకు ఈసీఐ నోటీసులను ఇస్తుందని చెప్పారు. సమావేశంలో ఎన్నికల ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి కిషన్, ఎన్నికల విభాగం అధికారి అనిల్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.