కామారెడ్డి, డిసెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ఆరు గ్యారంటీల అమలు కోసం ఈనెల 28వ తేదీ నుండి జనవరి 6 వరకు సంబంధిత అర్హుల నుండి దరఖాస్తుల స్వీకరణ కోసం చేపట్టే కారక్రమానికి జిల్లా మండల అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజాపాలన పకడ్బందీగా అమలుచేయుటకు రాష్ట్ర ప్రభుత్వం పూర్వపు జిల్లాలకు మంత్రులను ఇంచార్జిలుగా నియమించిందని ఆయన తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా నియమించిన రాష్ట్ర మద్యనిషేధ, అబ్కారి, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్‌లోని ఐడిఓసి సమావేశ మందిరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేయనున్నారని కలెక్టర్ తెలిపారు.
ఇట్టి కార్యక్రమం నిర్వహణ కోసం నియోజకవర్గం వారిగా ఆర్డిఓ లను, మండల ప్రత్యేక అధికారులుగా జిల్లా అధికారులను, మున్సిపల్ వార్డువారిగా అధికారులను నియమించామని కలెక్టర్ తెలిపారు. ఇట్టి సమావేశానికి రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తప్పక హాజరు కావలసిందిగా కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించుటకు నియోజకవర్గం, మండల, గ్రామస్థాయిలలో ప్రత్యేక అధికారుల బృందాలు ఆయా గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి మహాలక్ష్మి , గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా తదితర పథకాలు (ఆరు గ్యారెంటీ)ల కోసం ఉదయం, 8 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి 6 గంటల వరకు, రెండు ధపాలుగా దరఖాస్తులు స్వీకరించాలన్నారు, ప్రజలకు చేరువగా పాలన అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు.
జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు అందించడం కోసం దరఖాస్తుల స్వీకరణ కోసం ఒకరోజు ముందు ఆయా గ్రామాలలో, వార్డుల్లో దండోరా (టామ్ టామ్) వేయించి, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు ముందు ప్రభుత్వ సందేశం వినిపించి కార్యక్రమాలను ప్రారంభించాలన్నారు.
గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ, పట్టణ స్థాయిలో వార్డు ఆఫీసులలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు కార్యక్రమాలు నిర్వహించబోయే తేదీలు సమయాలను ముందస్తుగా ప్రజలకు తెలియజేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయవలసి ఉంటుందని అధికారులకు సూచించారు.