కామారెడ్డి, డిసెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ కామర్స్ , డిజిటల్ వర్తకం ఉపయోగించడం వల్ల వినియోగదారులకు సంపూర్ణ రక్షణ కలుగుతోందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ కామర్స్, డిజిటల్ వర్తకంలో వినియోగదారుల రక్షణ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మల్లికార్జున్ బాబు మాట్లాడారు.
ఈ కామర్స్ అనగా ఎలక్ట్రానిక్ కామర్స్, ఎలక్ట్రానిక్ నెట్వర్క్, ఇంటర్నెట్ ద్వారా వస్తువులు, సేవల కొనుగోలు, అమ్మకం , డేటాను ప్రసారం చేయవచ్చని సూచించారు. ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్స్ వస్తువులు తయారు చేస్తున్న కంపెనీకి, వాటిని కొనుగోలు చేస్తున్న వినియోగదారులకి మధ్య వారధిగా మాత్రమే ఉంటాయన్నారు. బయట దుకాణాల కంటే ఆన్లైన్లో రేట్లు చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు. మంచి గుర్తింపు కలిగిన ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్స్ నుంచే కొనుగోలు చేయాలన్నారు.
గుర్తింపు లేని రిటైలర్ల నుంచి ఎప్పుడు కొనవద్దని చెప్పారు. ఉచిత బహుమతులు, డిస్కౌంట్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఖరీదైన వస్తువులను ఆన్లైన్ ద్వారా కొనేటప్పుడు సాధ్యమైనంతవరకు క్యాష్ ఆస్ డెలివరీ ఎంచుకోవాలని చెప్పారు. మోసపూరిత ప్రకటనల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి వినియోగదారుడు డిజిటల్ లావాదేవీలు, సమాచారం మార్పిడి చేసేటప్పుడు కొన్ని స్వీయ జాగ్రతలు పాటించాలన్నారు. ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ అప్డేట్లను ఎంచుకోవాలన్నారు. ఒకసారి ఉపయోగించిన పాస్వర్డ్ లను తిరిగి ఉపయోగించకూడదని సూచించారు. ఈ వ్యక్తిగత సమాచారాన్ని బయటకు పంపవద్దని చెప్పారు.
అపరిచిత వ్యక్తుల మెయిల్స్, ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్లకు స్పందించవద్దని తెలిపారు. మీ బ్యాంకు ఖాతా వివరాలు, పిన్, సి వి వి నెంబర్ను ఎవరికి చెప్పవద్దని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, రాష్ట్ర వినియోగదారుల సహాయక కేంద్రం ద్వారా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. వినియోగదారులు 1800 425 00333/1967 కి ఫోన్ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చని సూచించారు. ప్రతి వినియోగదారుడు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వినియోగదారుల రక్షణ చట్టం – 2019 పై అవగాహన పెంచుకొని మోసపూరిత వ్యాపార విధానాల నుంచి రక్షణ కల్పించుకోవాలని కోరారు.
జిల్లా కార్మిక శాఖ అధికారి సురేంద్ర కుమార్ మాట్లాడారు. దుకాణాల నిర్వహణ కోసం లైసెన్సులు పొందడానికి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల మేనేజర్ అభిషేక్ సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య అధ్యక్షురాలు బొమ్మెర సువర్ణ చంద్రశేఖర్, జిల్లా డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మి పతి, రేషన్ షాప్ ల, గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.