డిచ్‌పల్లి, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ సెలబస్‌కు సంబంధించిన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, రెండవ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలను ఈ నెల 22 నుంచి 29 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఇది వరకే షెడ్యూల్ వెలువరించారు.
కాగా మంగళవారం సాయంత్రం డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో కంట్రోలర్ ఆన్‌లైన్ జూంఆప్‌లో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ తమ కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థుల హాల్ టికెట్స్‌ను ప్రిన్సిపాల్స్ తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్ నుంచి పొందవచ్చన్నారు.
హాల్ టికెట్స్ మీద విద్యార్థుల గుర్తింపు ఫోటోలు జతచేసి పంపుతున్నామని ఆయన అన్నారు. ఒకవేళ సాంకేతిక సమస్య వల్ల ఏ హాల్ టికెట్ మీద అయినా విద్యార్థి గుర్తింపు ఫోటో జత చేసి రాని పక్షంలో సంబంధిత ప్రిన్సిపాల్స్ బాధ్యత వహించి ఆయా విద్యార్థుల పాస్ పొర్ట్ సైజ్ ఫోటో అతికించి, సంతకం చేసి, కాలేజ్ స్టాంప్ ముద్రించి ఆ హాల్ టికెట్‌ను విద్యార్థులకు జారి చేయవలసిందిగా సూచించారు. విద్యార్థులు కూడా హాల్ టికెట్ కాలేజ్ నుంచి పొందే క్రమంలో తమ హాల్ టికెట్ మీద ఫోటో ఉందో, లేదో ఒకసారి చెక్ చేసుకోవలసిందిగా ఆయన కోరారు.
విద్యార్థుల సౌలభ్యం కోసం 47 డిగ్రీ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. డిగ్రీ పరీక్షల నిర్వహణ కోసం అంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు. పరీక్షా కేంద్రాలలో కొవిద్ – 19 నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్, వాటర్ బాటిల్ వంటివి వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు. 6 అడుగుల భౌతిక దూరం నియమంతో మెలగాలని సూచించారు. అర్థగంట ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరు కావాలని ఆజ్ఞాపించారు. ఆలస్యమైన విద్యార్థులను ఎట్టి పరిస్థితిలో పరీక్షాకేంద్రంలోకి ప్రవేశం కల్పించబోమని పేర్కొన్నారు.