అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ‘ప్రజా పాలన’కు శ్రీకారం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని నిజామాబాద్‌ జిల్లాలో గురువారం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ప్రారంభించారు. నేటి నుండి జనవరి 06 వరకు (8 పని దినాలలో) కొనసాగనున్న ఈ కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా షెడ్యూల్‌ ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా మొదటి రోజైన గురువారం 112 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 146 మున్సిపల్‌ వార్డులలో ప్రజా పాలన సభలు కొనసాగాయి.

ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిట్లోకి తెస్తూ, వారి సమస్యలను పరిష్కరించడం, అర్హులైన వారందరికీ దశల వారీగా, నిర్ణీత కాల వ్యవధిలో ఆరు గ్యారంటీల ద్వారా లబ్ది చేకూర్చడం, ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్ధిక సాధికారత చేకూర్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ప్రజాపాలన సభల కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రద్దీ, తోపులాటలు ఆస్కారం లేకుండా మహిళలు, పురుషుల కోసం వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల నుండి అధికార బృందాలు దరఖాస్తులు స్వీకరించాయి.

స్వీకరించిన ప్రతి దరఖాస్తు వివరాలను ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేస్తూ, దరఖాస్తుదారులకు రశీదులు అందించారు. దరఖాస్తుల వివరాలను కంప్యూటరీకరణ చేసేందుకు వీలుగా టీమ్‌ లీడర్లు వాటిని భద్రపర్చారు. ఉదయం 8.00 గంటలకే ప్రజాపాలన సభలతో పల్లెలు, వార్డులలో సందడి మొదలయ్యింది. ఉదయం నుండి మధ్యాహ్నం 12.00 వరకు, భోజన విరామం అనంతరం తిరిగి మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు రెండు సెషన్లలో సభలను నిర్వహించారు.

ప్రతిచోటా ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి అధికారులకు దరఖాస్తులు అందించారు. ముందుగానే వారికి దరఖాస్తులను అందుబాటులో ఉంచుతూ, వాటిని ఎలా పూరించాలనే దానిపై అధికారులు సూచనలు చేస్తూ అంగన్వాడీలు, విద్యావంతులైన యువకులు, వలంటీర్ల ద్వారా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు. సభలు ప్రారంభమైన వెంటనే అధికారులు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములై ఈ కార్యక్రమానికి వన్నెలద్దారు.
ప్రజల సౌలభ్యం కోసం అవసరమైన సంఖ్యలో కౌంటర్లు అందుబాటులో ఉంచుతూ, అధికారులు పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టడం సత్ఫలితాలు ఇచ్చింది.

జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని మాధవనగర్‌, మోపాల్‌ మండలం తాడెం గ్రామాలలో నిర్వహించిన ప్రజాపాలన సభలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, రసీదులు అందజేత, రిజిస్టర్ల నిర్వహణ, వివరాల నమోదు, ప్రజలకు అందుబాటులో ఉంచిన తాగు నీరు, షామియానాలు వంటి వసతులను పరిశీలించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఏ చిన్న ఇబ్బందులకు తావు లేకుండా పకడ్బందీగా సభలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కాగా, ఉమ్మడి జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ గా నియమితులైన ఐ.ఏ.ఎస్‌ అధికారిణి హరిత ఇందల్వాయి మండలం రంజిత్‌ నాయక్‌ తండా, డిచ్పల్లి మండలం వెస్లీనగర్‌ తండా, మాధవనగర్‌ తదితర ప్రాంతాల్లో ప్రజాపాలన కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించారు.

అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగర పాలక కమిషనర్‌ మకరంద్‌ సైతం విస్తృతంగా పర్యటిస్తూ ప్రజాపాలన సభలకు తోడ్పాటును అందించారు. ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు సంబంధించి ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులను అందించారు.

బాపునగర్‌ నుండి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన బోధన్‌ ఎమ్మెల్యే

బోధన్‌ నియోజకవర్గం ఎడపల్లి మండలంలోని బాపునగర్‌ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యులు పి.సుదర్శన్‌ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి, వారికి రశీదులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.

ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చడమే ప్రజా పాలన ధ్యేయమని ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు. జనవరి 06 వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, అర్హులైన వారందరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మేలు చేకూర్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు చేయాలని హితవు పలికారు.

అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి బోధన్‌ పట్టణంలోని ఆయా వార్డులతో పాటు చిన్నమావందిలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట బోధన్‌ ఆర్డీఓ రాజాగౌడ్‌, బోధన్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్‌ హుస్సేన్‌, ఎంపీడీఓ గోపాలకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

ఖనాపూర్‌ లో ప్రజా పాలనను ప్రారంభించిన రూరల్‌ ఎమ్మెల్యే

కాగా, నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని ఖనాపూర్‌ లో ప్రజాపాలన గ్రామ సభను రూరల్‌ ఎమ్మెల్యే పి.భూపతి రెడ్డి ప్రారంభించారు. అర్హులైన ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా నిర్ణీత కాలవ్యవధిలో అందరికీ ఆయా పథకాల ద్వారా లబ్ది చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, కార్పొరేటర్‌ కోర్వ లలితా గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

సభలలో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు తమ ఆటపాటలతో ప్రజాపాలన కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Check Also

మీ ఇంటి సర్వే కాలేదా.. ఫోన్‌ చేయండి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »