నిజామాబాద్, డిసెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా పాలన సభలలో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రజల నుండి నిర్ణీత నమూనా దరఖాస్తు ఫారాలను స్వీకరించడం జరుగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
దరఖాస్తు ఫారాల కొరత ఎంతమాత్రం లేదని, ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాల పరిధిలోని అన్ని వార్డులకు నివాస గృహాల సంఖ్యకు అనుగుణంగా అప్లికేషన్ ఫారాలను కేటాయించడం జరిగిందని అన్నారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 275183 నివాస గృహాలు ఉండగా, అంతే సంఖ్యలో దరఖాస్తు ఫారాలు ఆయా జీ.పీలకు పంపిణీ చేశామన్నారు.
అదేవిధంగా నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 146 వార్డులకు గాను 130866 దరఖాస్తులు పంపిణీ చేశామన్నారు. గ్రామ పంచాయతీలు, వార్డులను కలుపుకుని మొత్తం 406049 దరఖాస్తులు కేటాయించి, గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా, మున్సిపల్ పట్టణాలలో ఆర్.పీలు, ఇతర సిబ్బంది ద్వారా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వీటితో పాటు అదనంగా మరో 93,000 దరఖాస్తు ఫారాలు సైతం అందుబాటులో ఉంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
దరఖాస్తు ఫారాలకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నిర్ణీత దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంచి, పూరించిన వాటిని స్వీకరించడం జరుగుతుందని అన్నారు.