కామారెడ్డి, డిసెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన అభయ హస్తం ఆరు గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజంపేటలో, తాడ్వాయి మండలం ఎర్రపాడు గ్రామాలను సందర్శించి కార్యక్రమ నిర్వహణ తీరును పరిశీలించారు.
అక్కడకు వచ్చిన ప్రజలకు ప్రజాపాలన కార్యక్రమ ఉద్దేశ్యాన్ని వివరించడంతో పాటు కార్యక్రమంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలు, మూడు మునిసిపాలిటీలలో 80 వార్డులోని గృహాల కనుగుణంగా కలర్‌లో ముద్రించిన 2.21 లక్షల దరఖాస్తు ఫారాలు ఆయా గ్రామ పంచాయతీలకు, మునిసిపల్ వార్డులకు పంపిణి చేశామని అన్నారు.
గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా, మున్సిపల్ పట్టణాలలో వార్డు అధికారుల ద్వారా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వీటితో పాటు అదనంగా మరో లక్ష దరఖాస్తు ఫారాలు సైతం అందుబాటులో ఉంచడం జరిగిందని అదనపు కలెక్టర్ తెలిపారు. దరఖాస్తు ఫారాలకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
అర్హులైన/నిజమైన లబ్ధిదారుల ప్రతి కుటుంబానికి నిర్ణీత దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంచి, పూరించిన దరఖాస్తులను స్వీకరించి రసీదు అందజేయాలన్నారు.. నిరక్షరాస్యులు దరఖాస్తులు సక్రమంగా పూరించుటకు వీలుగా అవసరమైన కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించాలన్నారు. రైతు బందు పొందుతున్న వారు రైతు భరోసాకు ధరఖాస్తుచేసుకోవాలని తెలపాలన్నారు.
నిస్సహాయులకు సాయం చేయడమే ప్రజాపాలన ఉద్దేశ్యమని, ప్రభుత్వమే స్వయంగా నేడు మీ ఊరికి వచ్చి మహాలక్ష్మి , రైతు భరోసా, గృహాజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుట పధకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులు స్వీకరిస్తుందని ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రజలకు వివరించాలని చంద్రన్ మోహన్ తెలిపారు. ఇదివరకే పింఛను పొందుతున్న వారు తిరిగి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని, పెంచిన పింఛను అందుతుందని లబ్దిదారులకు వివరించాలని అన్నారు.
ఏదేని కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేని వారు జనవరి 6 వరకు సంబంధిత గ్రామ పంచాయతీలో దరఖాస్తుచేసుకునేలా అవగాహన కలిగించాలన్నారు. ఒక్కో పధకానికి విడివిడిగా దరఖాస్తు అవసరం లేదని, ఏ పధకం కావాలో టిక్ మార్కు చేయాలని, ఒక కుటుంభం నుండి ఒక దరఖాస్తు ఫారం భర్తీచేసి సమర్పించాలని ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు.
లబ్ధిదారులు రంగులలో ముద్రితమైన ప్రజాపాలన దరఖాస్తులను ఆయా కేంద్రాలలో ఉచితంగా పొంది భర్తీ చేసిన ఫారం వెంట రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ జతపరచి సమర్పించాలని అదనపు కలెక్టర్ సూచించారు. రేషన్ కార్డు లేని, కొత్తగా రేషన్ కార్డు కావలసిన వారు అదే దరఖాస్తులో రేషన్ కార్డు నెంబరు వద్ద కొత్త రేషన్ కార్డు అవసరం ఉందని వ్రాస్తే సరిపోతుందని, దరఖాస్తులో కుటుంభం సభ్యుల వివరాలు ఉంటాయని, విడిగా దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్ధార్, మండల అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు.