నిజామాబాద్, డిసెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అర్హులైన వారికి ఆరు గ్యారంటీల ద్వారా లబ్ది చేకూరుస్తూ, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని కేశాపుర్, ధర్మారం(బి) గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాలను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రజలకు అందుబాటులో ఉంచిన అప్లికేషన్లు, వారి వద్దనుండి స్వీకరిస్తున్న దరఖాస్తులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అభయ హస్తం క్రింద అర్హులైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలని, దరఖాస్తులను పూరించే విషయంలో ప్రజలకు సహకారం అందించాలని సూచించారు.
షామియానా, మంచినీటి సౌకర్యం కల్పించడం, దరఖాస్తులు నింపడానికి ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లు, దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా పాలన సభలలో దరఖాస్తులు సమర్పించేందుకు వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏ చిన్న ఫిర్యాదుకు సైతం ఆస్కారం ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని హితవు పలికారు. సభకు హాజరయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న పక్షంలో అందుకు అనుగుణంగా కౌంటర్ల సంఖ్యను పెంచాలని, సరిపడా దరఖాస్తులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఎవరు కూడా మీ సేవ సెంటర్ లు, జిరాక్స్ సెంటర్ల నుండి డబ్బులను వెచ్చించి దరఖాస్తులు కొనుగోలు చేయకూడదని, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మెప్మా ఆర్.పీల ద్వారా ప్రతి నివాస ప్రాంతంలో దరఖాస్తులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.
ప్రజాపాలన సభలలోనూ వీటిని ఉచితంగా అందించడం జరుగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని పథకాలకు కుటుంబం నుండి ఒకే దరఖాస్తు ఇస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. గ్రామ సభల వద్ద హెల్ప్ డెస్క్ లు అవసరం మేర పెంచాలని, ఒకవేళ ఏదేని కారణాల వల్ల గ్రామ సభ రోజు దరఖాస్తు చేయని వారు జనవరి 6 లోగా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తును అందజేయవచ్చని, దరఖాస్తులు సమర్పించిన వారికి తప్పక రసీదు ఇవ్వాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట మెప్మా పీ.డీ రాజేందర్ తదితరులు ఉన్నారు.