కామారెడ్డి, డిసెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గత పార్లమెంటు, శాసనసభ ఎన్నికల సందర్భంగా జరిగిన బ్యాంకు లావాదేవీలు, మద్యం అమ్మకాల వివరాలతో పాటు ప్రస్తుతం ఆరు మాసాలలో జరిగిన బ్యాంకు లావాదేవీలు, మద్యం అమ్మకాల వివరాలు వెంటనే అందజేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వ్యయ సునిశిత నియోజక వర్గాల గుర్తింపు, వ్యయ సునిశిత పాకెట్ (కామారెడ్డి పట్టణ ప్రాంతంలోని కొంత భాగం) ల గుర్తింపు నిమిత్తం ఏర్పాటు చేసిన ఎన్నికల విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించుటకు గత ఎన్నికలలో జరిగిన అనుభవాలను మననం చేసుకొని వాటిని అధిగమించుటకు తగు ప్రణాళికలు రూపొందించాలన్నారు.
అందులో భాగంగా సమాన ప్రక్రియ పద్ధతి (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ )న గత ఎన్నికలల్లో నియోజక వర్గంలో విచ్చలవిడిగా ధన వ్యయం చేసిన వివరాలను సెక్టార్ వారీగా సమగ్ర నివేదిక అందించాలన్నారు. ఇఎస్‌పిని గుర్తించుటకు నగదు, మద్యం, ఫిర్యాదులు ప్రామాణికమని అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో జిల్లాలో 6 కోట్ల 65 లక్షల నగదు, మద్యం,మత్తు పదార్థాలు స్వాధీనపరచుకోగా అందులో కామారెడ్డి నియోజక వర్గంలో 4 కోట్ల 42 లక్షలు ఉన్నాయని అన్నారు.
అదేవిధంగా సి విజిల్ యాప్ ద్వారా 157 కేసులు నమోదు కాగా అందులో కామారెడ్డి నియోజక వర్గానికి సంబంధించి 39 కేసులున్నాయని అన్నారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న డబ్బు, మద్యం కేసులు నమోదు చేసిన వివరాలు, మాదక ద్రవ్యాల నిరోధక క్రింద నమోదు చేసిన కేసుల వివరాలు, తరచుగ నేరాలకు పాల్పడే వారి వివరాలు అందించాలన్నారు.
అదేవిధంగా గత ఎన్నికలల్లో నేరాలకు పాల్పడి రిజిస్టర్ చేసిన కేసుల వివరాలు, కుల, మత సంఘర్షణలు తదితర సంబంధించిన కేసుల వివరాలు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వివరాలు అందజేయవలసినదిగా కోరారు.
సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి, ఆర్.డి.ఓ. శ్రీనివాస్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధీర్ భార్గవ్, ఇంచార్జి ఆబ్కారీ అధికారి సుందల్ సింగ్, ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా, ఎన్నికల పర్యవేక్షకుల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.