ప్రజల ప్రగతి కోసమే ప్రజా న్యాయపీఠాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

మానవ సమాజంలో మానవ సంబందాలే ముఖ్యమని,కక్షలు, కార్పణ్యాలు విచ్చిన్నానికి దారి తీస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌ పర్సన్‌ సునీత కుంచాల అన్నారు. పౌరుల మధ్య పొరపొచ్చాలు, పగలు, ప్రతీకారాలు అనేక అనర్థాలకు దారి తీస్తాయని, ప్రతి ఒక్కరూ హేతుబద్ధంగా జీవించడం అలవర్చుకోవాలని హితవు పలికారు.

జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవసదన్‌ లో జాతీయ లోక్‌ అదాలత్‌ ను శనివారం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.జయరాంతో కలిసి జిల్లా జడ్జి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా సమూహాలు చట్టానికి లోబడి జీవించాలని, చట్ట వ్యతిరేకమైన జీవనశైలి, చర్యలకు దూరంగా ఉండాలన్నారు.

వ్యక్తులతో వ్యవస్థ నిర్మాణం అయిందని, ఆ వ్యవస్థ కొన్ని నియమాలతో ముందుకు సాగుతోందన్నారు. వ్యవస్థ సాఫీగా సాగేందుకు చట్టాల అవసరం ఏర్పడిరదని, చట్టాలను అనుకరించడ అందరి కర్తవ్యం అన్నారు. పౌరుల మధ్య దీర్ఘకాలిక శత్రుత్వాలు కొనసాగరాదనే లక్ష్యం తో లోక్‌ అదాలత్‌ లు నిర్వహిస్తూ, అన్ని రకాల సివిల్‌ దావాలు, రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులు పరిష్కరించడం జరుగుతున్నదని ఆమె వివరించారు.

జిల్లా పోలీసు, కార్యనిర్వాహక వర్గాల సహకారం తో సివిల్‌, క్రిమినల్‌ కేసులే కాకుండా సామాజిక బాధ్యతగా పౌరసమాజ ప్రగతికి న్యాయసేవ సంస్థ వివిద కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఆమె వెల్లడిరచారు. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, పదకొండేళ్ళుగా కొనసాగుతున్న ఒక సివిల్‌ వివాదాన్ని న్యాయసేవ సంస్థ సహకారంతో పరిష్కరించుకుని భీంగల్‌ భూనష్ట పరిహార బాధితులకు రూ. 3 కోట్ల 90 లక్షల బ్యాంకు చెక్‌ ను ప్రభుత్వం తరపున అందజేసి వివాదానికి ముగింపు పలికినట్లు తెలిపారు.

ట్రాపిక్‌ చలాన్లు వాహన దారులచే వసూలు చేయించడంలో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉంటే నిజామాబాద్‌ జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. ఏ పరిష్కారమైన అది జిల్లా అభివృద్ధికి చిహ్నమేనని అన్నారు. సామరస్యపూర్వక పరిష్కారమే అన్ని సమస్యలను సమసిపోయేలా చేస్తుందన్నారు. భారతీయ వికాసానికి వ్యక్తుల వ్యక్తి గత బీమా పథకం ముఖ్యమని, కొన్ని రకాల ఆర్థిక సమస్యల పరిష్కారంలో బీమా ప్రీమియంలు క్రియాశీలకంగా నిలుస్తూ బాధితులకు ఊరటనిస్తున్నాయని కలెక్టర్‌ గుర్తు చేశారు.

కాగా, మతపరమైన కేసులు తప్ప అన్ని రకాల రాజీపడదగిన క్రిమినల్‌ కేసులు లోక్‌ అదాలత్‌ లో పరిష్కారం అయ్యే విదంగా న్యాయసేవ సంస్థకు పోలీసు శాఖ తనవంతు బాధ్యతగా సహకరిస్తున్నదని అదనపు డీసీపీ జయరాం తెలిపారు.

రూ. 3.90 కోట్ల చెక్కు అందజేత

ఆర్మూర్‌ రెవిన్యూ డివిజన్‌ లోని భీంగల్‌ మండల కేంద్రంలో పేదలకు నివేశన స్థలాల కోసం సేకరించిన భూమి విషయమై భూ నిర్వాసితులైన వారికి మంజూరైన రూ. 3 కోట్ల 90 లక్షల చెక్‌ ను జిల్లాజడ్జి సునీత, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, ఆర్మూర్‌ ఆర్‌.డీ.ఓ వినోద్‌ లతో కలిసి అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా న్యాయాసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పద్మావతి, అదనపు జిల్లా జడ్జి ఆశాలత, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీకాంత్‌ బాబు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవదాసు, ఉపాధ్యక్షుడు ఆశ నారాయణ, న్యాయాసేవాధికార సంస్థ సూపరింటెండెంట్‌ పురుషోత్తం గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »