కామారెడ్డి, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజాపాలన దరఖాస్తుల ను అన్ని గ్రామ, వార్డులలో పుష్కలంగా అందుబాటులో ఉంచామని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రజాపాలన నాల్గవ రోజైన మంగళవారం దోమకొండ మండలం లింగుపల్లి, తూజాల్పూర్, బిక్నూర్ మండలం బస్వాపూర్, మాచారెడ్డి మండలంలోని బండ రామేశ్వర్ పల్లి, అక్కాపూర్, పాల్వంచ, రామారెడ్డి మండలంలోని ఖానాపూర్‌లో కొనసాగుతున్న కార్యక్రమ నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కౌంటర్లు, దరఖాస్తు ఫారాలు నింపేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు, గ్రామ కార్యదర్శుల వద్ద ఉన్న దరఖాస్తులు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచినీరు, టెంట్, కుర్చీల వంటి సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు అందజేస్తున్న దరఖాస్తు ఫారాలను పరిశీలించారు.
గ్రామాలలోని కుటుంభాలకనుగుణంగా కలర్‌లో ముద్రించిన దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచామని, కుటుంబ యజమాని రేషన్ కార్డు, ఆధార్ కార్డు చూయించి ఉచితంగా దరఖాస్తు ఫారం పొంది వాలంటీర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధుల సహాకారంతో ఫారం పూరించి కుటుంబం నుండి అన్ని పథకాలకు ఒకే దరఖాస్తు ఫారం ఇస్తే సరిపోతుందని అన్నారు.
ఏ ఏ పథకాలకు లబ్ది కావాలో ఆయా పధకాలకు టిక్ మార్కు చేయాలని, రేషన్ కార్డు లేకుంటే లేదని, కొత్తది కావాలని, రేషన్ కార్డులో కొత్తగా సభ్యుని పేరు చేర్చాలంటే కుటుంబ సభ్యుల వివరాల నమోదు ప్రక్కన నూతన సభ్యుడు అని నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. అనివార్య కారాణాలవల్ల నేడు దరఖాస్తు చేసుకోలేని వారు లబ్ది చేకూరాదేమోనని బయపడవలసిన అవసరం లేదని, ఈ నెల 6 లోగా ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అందజేయవచ్చని అన్నారు.
ఇప్పటివరకు స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని, ఎక్కువగా ప్రజలు ఏ పథకం కోసం దరఖాస్తు చేస్తున్నారనే వివరాల గురించి అధికారులను ఆరా తీశారు. గ్రామ సభల ద్వారా స్వీకరిస్తున్న దరఖాస్తులను గ్రామ పంచాయతీ వారీగా భద్రపరచాలని అధికారులకు సూచించారు. గత డిసెంబర్ 28 నుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం ఆరు గ్యారంటీల ప్రజాపాలన కార్యక్రమానికి జిల్లా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తున్నదని, డిసెంబర్ 30న నాటికి మూడు రోజులలో 1,07,262 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, భిక్నూర్ , దోమకొండ, పాల్వంచ ఎంపిడిఓలు అనంత రావు, చెన్నారెడ్డి, జయంత్ రెడ్డి, మాచారెడ్డి తహసీల్ధార్ శ్వేత ( మండల ప్రత్యేకాధికారులు) , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.