నిజామాబాద్, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేద్దామని, అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త సూచించారు.
గురువారం నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద ‘‘వికసిత్ భారత్ సంకల్పయాత్ర’’ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త ప్రారంభించారు.
ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను వారు సందర్శించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ…నిజామాబాద్ అర్బన్ లో ఇంత పెద్ద ఎత్తున వికసిత్ భారత సంకల్పయాత్ర కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరం. 2047కు మన భారతదేశం వికసితం కావాలంటే మనమందరం భాగస్వాములు కావాలి. దేశంలో 140 కోట్ల జనాభా 30 కోట్ల కుటుంబాలు వికాస్ లో ఉంటే దేశం అన్ని విధాల అగ్రగామిగా ఉంటుంది.
ఈ ప్రధాన లక్ష్యాన్ని అందుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించడమైనదన్నారు. పుట్టిన బిడ్డల నుంచి గర్భవతులు బాలింతలకు పోషణాభియాన్, వ్యవసాయపరంగా టెక్నాలజీ ఉపయోగిస్తూ డ్రోన్ ఉపయోగించుట, రీ సర్వే కార్యక్రమాల్లో ఆధునిక టెక్నాలజీ, ఐటీ పరంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐల ద్వారా నేరుగా అర్హులకు లబ్దిని అందించడం జరుగుతుంది.
పీఎం జీవన్ బీమా పథకంలో సంవత్సరానికి కేవలం 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాద బీమా అందుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియని వారికి, వాటిని వినియోగించుకోకుండా ఇంకా మిగిలిపోయిన వారికి పథకాలు అందించడానికి ఒక పండుగలాగా వికసిత్ భారత సంకల్ప యాత్రను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నిజామాబాద్ పట్టణంలో ఇంకనూ నిర్వహించనున్న వికసిత్ భారత సంకల్పయాత్ర కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. పిఎంజెఏవై, ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్, ఉజ్వల, జన్ ధన్ యోజన తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు.
అనంతరం ఆయా కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఇప్పటికే లబ్ధి పొందిన వారి స్పందనను కార్యక్రమంలో తెలియజేశారు.
సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలు, గోడప్రతులు, క్యాలెండర్లను ఆవిష్కరించి, ప్రజలకు పంపిణీ చేశారు. ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రచార వ్యానును జెండా ఊపి ప్రారంభించారు.
కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, డిస్ట్రిక్ లీడ్ బ్యాంకు మేనేజర్ యు.నాగ శ్రీనివాస రావ్, ఎన్‌వైకె డిస్ట్రిక్ కోఆర్డినేటర్ శైలి బెల్లాల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ వెంకట భార్గవ నాయుడు, కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ, సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ఎఫ్ పిఏ రషీద్, ఎంటిఎస్ పోచయ్యా, వివిధ శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు, బిజెపి పార్టీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.