కామారెడ్డి, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజాపాలనలో ప్రజలు అందిస్తున్న దరఖాస్తులను పరిశీలించి ఏ పధక లబ్ది కావాలో అది పూరించేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. గురువారం కామారెడ్డి మునిసిపాలిటీ 13వ వార్డులోని కాట్రియల్ లో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సక్రమంగా దరఖాస్తులు అందజేయడంతో పాటు వాటిని సరిగ్గ్గా పూరించేలా అవగాహన కలిగించాలని అన్నారు.
ప్రజలు కూడా ఎక్కడ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లలోని సిబ్బంది సహకారంతో ధరఖాస్వతులు నింపి రేషన్ కార్డు, ఆధార్ కార్డు జతపరచి సమర్పించాలన్నారు. గ్రామా సభలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రమపద్ధతిలో దరఖాస్తులు స్వీకరించాలన్నారు. అట్టి ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశిలించి తప్పులు లేకుండా రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ చేయాలని, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మండల అధికారులను ఆదేశించారు.
అందుకు సంబంధించి కంప్యూటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను సిద్ధం చేసుకొని నిర్దారిత సమయంలోగా డేటా నమోదు చేయాలని సూచించారు. కాగా సదాశివనగర్ మండలంలోని ఉత్తనూర్‌లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించి దరఖాస్తు ఫారంలోని అన్ని వివరాలు సరిగ్గా రాశారా, ఏ పధకం లబ్ది కొరకు టిక్ మార్కు చేశారు? రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి జేతపరిచారా పరిశీలించిన మీదటే దరఖాస్తులు స్వీకరించి రసీదు అందజేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహశీల్ధార్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.