సమాజానికి తోడ్పాటును అందించాలనే తపనతో ముందుకు సాగాలి

నిజామాబాద్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

సమాజానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని, ఆ దిశగా ముందుకు సాగినప్పుడే అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన సమాజం ఆవిష్కృతం అవుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ ఉద్బోధించారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్పల్లి మండల కేంద్రంలో మన ఊరు – మన బడి కార్యక్రమం కింద రూ. 62.77 లక్షల ప్రభుత్వ నిధులతో పాటు దాతలు పెద్ద ఎత్తున సమకూర్చిన విరాళాలను వెచ్చిస్తూ అన్ని సదుపాయాలతో అధునాతన హంగులను సమకూరుస్తూ నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు.

సరస్వతి మాత విగ్రహానికి పూజలు చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే ఆర్‌.భూపతిరెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి తదితరులు ఈ సంరంభంలో భాగస్వాములయ్యారు. పాఠశాల నిర్మాణానికి సింహభాగం విరాళాలను అందించి తన దాతృత్వాన్ని చాటుకున్న పైపుల రాజిరెడ్డి, అతని కుటుంబ సభ్యులతో పాటు ఇతర దాతలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దాతృత్వం అంటే ఎలా ఉండాలనడానికి పైపుల రాజిరెడ్డి ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు తమ సొంత ఊరికి, సమాజానికి తోడ్పాటును అందించాలని సూచించారు. ఇతర వాటితో పోలిస్తే సమాజంలో విద్య, వైద్యం ఎంతో కీలకమైనవని, ఈ రెండు రంగాలను పటిష్టపర్చాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఇందులో భాగంగానే సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తున్న ఆరోగ్యశ్రీ సేవలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడిరచారు.

అదేవిధంగా అందరికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆయా వర్గాల వారిలో నెలకొని ఉన్న చులకన భావం దూరం కావాలన్నారు. ప్రజాప్రతినిధులందరూ ప్రభుత్వ బడుల గురించి తప్పనిసరిగా ఆలోచన చేస్తూ, వాటి అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అంకితభావంతో కృషి చేయాలని, దీనిని నిరంతర ప్రక్రియగా భావించాలని పిలుపునిచ్చారు.

సమాజానికి, ప్రపంచ మానవాళికి ఉపయోగపడే విద్య, వైద్య రంగాలను లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో చూడాలని హితవు పలికారు. ఒక వ్యక్తి సంపూర్ణంగా ఎదగాలంటే విద్యతో పాటు మంచి సంస్కారం, సామాజిక బాధ్యతను గుర్తెరిగి మెలగడం ఎంతో అవసరమని అన్నారు. అలాంటప్పుడే ఆలోచనల్లో మార్పు వచ్చి సమాజానికి సాయపడాలనే తపన పెరుగుతుందన్నారు.

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు దాత రాజిరెడ్డి పెద్ద ఎత్తున తోడ్పాటును అందించడం అభినందనీయమని జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలకు సహకారం అందిస్తే ఏ విధమైన అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయనడానికి జక్రాన్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణమే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, మన మూలలను మర్చిపోకుండా స్వస్థలానికి తమ శక్తి మేరకు సహకారం అందించాలని సూచించారు.

దాతలు అందించిన తోడ్పాటుతో అన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయని, వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో బాగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్‌ సూచించారు. రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అందరికీ ఆదర్శంగా నిలిచేలా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.

కాగా, డిచ్పల్లిలో మాతా,శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని, ఇందల్వాయిలో ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరగా, మంత్రి దామోదర రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు. అంతకుముందు జక్రాన్పల్లి శివారులోని దేవునితండాలో గల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు.

కార్యక్రమాల్లో నిజామాబాద్‌, ఆర్మూర్‌ ఆర్డీఓలు రాజేంద్రకుమార్‌, వినోద్‌ కుమార్‌, డీఈఓ దుర్గాప్రసాద్‌, ఎంపిపి విమల, జెడ్పిటీసి తనూజ రెడ్డి, సర్పంచ్‌ చంద్రకళ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినివిద్యార్థులు, గ్రామస్థులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »