కామారెడ్డి, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాల ద్వారా లబ్ది చేకూర్చాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యెల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి, గాంధారి మండలం గుర్జాల్ తండాలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యాంరంటీ పధకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశ్యంతో గత డిసెంబర్ 28 నుండి ఈ నెల 6 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి అర్హులైన కుటుంబాల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నదని అన్నారు. దరఖాస్తు ఫారాలను పూర్తి ఉచితంగా అందించడంతో పాటు వాటిని సక్రమంగా పూరించుటకు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని, సిబ్బంది సహాయంతో ఏ పధకానికి లబ్ది అవసరమో ఆ విధంగా ఫారాలు పూరించి అందజేయాలన్నారు.
ఎవ్వరు తప్పుడు సమాచారం ఇవ్వరాదని, పనిచేసే వ్యవస్థను బదలామ్ చేయరాదని కోరారు. ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసిందని, త్వరలో అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు, ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తూ దీనివెంట రేషన్ కార్డు, ఆధార్ కార్డు జతపరిచార, ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించారా అని ఆరా తీశారు.
ప్రజల నుండి తీసుకుంటున్న దరఖాస్తులను రిజిస్టర్ లో నమోదు చేస్తున్న వివరాలను పరిశిలిస్తూ వచ్చిన ధరఖాస్తులన్నింటిని తప్పులు లేకుండా పకడ్బందీగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ గురువారం వరకు జిల్లాలోని 489 గ్రామ, వార్డులలో సభలు నిర్వహించి లబ్ధిదారుల నుండి 2,28,516 దరఖాస్తులు స్వీకరించడంతో పాటు వివిధ పధకాలు/సమస్యలకు సంబంధించి మరో 8,818 దరఖాస్తులు స్వీకరించామని అన్నారు.
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశిలించి ఆన్‌లైన్ నమోదు చేయనున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలలో ఎంపిక చేసుకున్న పధకం పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిడిఓ లక్ష్మి, తహశీల్ధార్ జానకి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.