కామారెడ్డి, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం జిల్లా కార్యాలయంలో పట్టణ ఇంచార్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదట పట్టణ అధ్యక్షుడు విపుల్ జైన్ జిల్లా కార్యాలయం ఎదుట జండా ఆవిష్కరించి అనంతరం పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభించారు.
ఈ సందర్భంగా పట్టణ ఇన్‌చార్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల రాము మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల జట్టు ఏర్పాటు చేసుకొని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వివరించి అందరికి లబ్ది చేకూరే విధంగా చూడాలని అన్నారు.
పార్టీ సిద్ధాంతాలను యువతకు చేరువయ్యేలా చూడాలన్నారు. అధికార పార్టీ లోపాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజాసమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాలని అన్నారు. పట్టణంలోని వార్డుల్లో ప్రజల సమస్యలపై బీజేపీ కౌన్సిలర్ల ద్వారా పరిష్కార మార్గాలు చూపాలన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి గడ్డపై కాషాయ జండా ఎగరవేయటంలో పట్టణ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.