కామారెడ్డి, మే 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నేడు, రేపు ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యాన్ని రాత్రి పొద్దుపోయాక కూడా లిఫ్ట్ చేయవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని శాబ్దిపూర్లో కొనుగోలు కేంద్రాన్ని, క్యాధంపల్లి లో ఓం శ్రీ వెంకటేశ్వరా బాయిల్డ్ రైస్ మిల్లును, పాల్వంచ మండలంలోని భావనిపేటలో భూలక్ష్మి రైస్ మిల్, గాయత్రీ బాయిల్డ్ రైస్ మిల్లులను జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబుతో కలిసి పరిశిలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే సూచనలున్నందున ధాన్యం రాశులను త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించాలని, మౌలిక వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు కూడా ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఎగిరిపోకుండా చూసుకోవాలని కోరారు.
అధైర్యపడవద్దని తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తామని అన్నారు. కాగా తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతం తగ్గేలా చూడాలన్నారు. అనంతరం బాయిల్డ్, రా రైస్ మిల్లులను సందర్శించి అక్కడ వేచి ఉన్న లారీలలో ధాన్యాన్ని వెంటనే అన్ లోడ్ చేసుకోవాలని, ట్రక్ షీట్ జారీచేయాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా మిల్లులకు వచ్చిన లారీలను 24 గంటల లోగా అన్ లోడ్ చేసుకొని త్రిప్పి పంపితే తిరిగి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం లోడిరగ్ చేసి పంపడానికి అవకాశముంటుందని అన్నారు.
ఈ రబీ సీజన్లో ఇప్పటి వరకు 42,142 మంది రైతుల నుండి 526 కోట్ల విలువ గల 2,38,488 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన చేస్తూ 84 శాతం మేర 441 కోట్లు రైతుల ఖాతాలో జమచేశామని చేశామని, మిగతా డబ్బులు రైతుల ఖాతాలో త్వరలో జమచేస్తామని చంద్రమోహన్ తెలిపారు. వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేస్తూ త్వరగా డబ్బులు ఖాతాలో జమచేస్తుండడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పౌర సరఫరాల ఉప తహసీల్ధార్లు పాల్గొన్నారు.