కామారెడ్డి, మే 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జెసి చాంబర్లు గురువారం రెవెన్యూ, జిల్లా పౌర సరఫరాల అధికారులతో ధాన్యం కొనుగోల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే సూచనలున్నందున ధాన్యం రాశులను త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించాలని, మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులు కూడా ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఎగిరిపోకుండా చూసుకోవాలని కోరారు. రైతులు అధైర్యపడవద్దని, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి అధికారులు బాయిల్డ్ మిల్లులకు తరలించే విధంగా చూడాలన్నారు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతం తగ్గేలా చూడాలన్నారు.
లారీలలో ధాన్యాన్ని వెంటనే అన్ లోడ్ చేసుకోవాలని, ట్రక్ షీట్ జారీచేయాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా మిల్లులకు వచ్చిన లారీలను 24 గంటల లోగా అన్ లోడ్ చేసుకొని త్రిప్పి పంపితే తిరిగి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం లోడిరగ్ చేసి పంపడానికి అవకాశముంటుందని అన్నారు. ఈ రబీ సీజన్‌లో ఇప్పటి వరకు 42,142 మంది రైతుల నుంచి 526 కోట్ల విలువ గల 2,38,488 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన చేస్తూ 84 శాతం మేర 441 కోట్లు రైతుల ఖాతాలో జమచేశామని చేశామని, మిగతా డబ్బులు రైతుల ఖాతాలో త్వరలో జమచేస్తామని చంద్ర మోహన్ తెలిపారు.
వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేస్తూ త్వరగా డబ్బులు ఖాతాలో జమ చేసే విధంగా చూడాలని జెసి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, ఇన్చార్జి జిల్లా పౌరసరపరాల మేనేజర్ నిత్యానందం, ఉప తహసీల్ధార్లు పాల్గొన్నారు.