కామారెడ్డి, మే 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సమాజంలో పలు విషయాలకు భయపడుతూ కుటుంబం, పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్న, రోడ్డు ప్రమాదాల పట్ల భయపడడం లేదని, తద్వారా ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందని గమనించి బయటికి వెళ్ళేటప్పుడు తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే కుటుంబ రోడ్డున పడతారని హితవు చెప్పారు.
మంగళవారం సదాశివనగర్ మండలం మర్కల్ లో సిపిఆర్, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన, శిక్షణ కార్యక్రమాలతో పాటు రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. పలువురు పొలిసు అధికారులు, సిబ్బంది రక్త దానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని సదాశివనగర్ మండలం జాతీయ రహదారిలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, గత సంవత్సరం జిల్లాలో 550 ప్రమాదాలు జరిగాయని అయినా ప్రజలు బయపడడంలేదని, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుచున్నాయని గుర్తించి రహదారుల ప్రక్కన గల డాబాలు, హోటళ్లు, పాన్‌షాప్‌లు, రిపేర్ షాపులు, ఇతర దుకాణాలు, ప్రజలకు అవగాహన నిమిత్తం ఈ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
తాగి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటుల బెల్టు పెట్టుకోకప్లోవడం, అతివేగం, ఓవర్ టేక్ చేయడం, సామర్ధ్యానికి మించి ఎక్కించుకోవడం, రాంగ్ సైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ చేయడం తదితర కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తమ కళ్లెదుట ప్రమాదం జరిగిన వెంటనే మానవతా దృక్పధంతో వెంటనే స్పందించి బాధితులకు సహాయ చర్యలు చేపట్టి, వైద్య సహాయం అందించగలిగితే ఒకరి ప్రాణం కాపాడమన్న ఆత్మ సంతృపి కలుగుతుందని, ఆ కుటుంబం కూడా జీవితాతంతం గుర్తు పెట్టుకొని ఆశీస్సులు అందిస్తారని అన్నారు.
అదేవిధంగా దైనందిన జీవన శైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పు ద్వారా చిన్న వయస్సులోనే గుండె పోటుకు గురవుచున్నారని, ప్రతి ఒక్కరు సిపిఆర్‌పై కనీస అవగాహన కలిగి ఉండడం వల్ల, చుట్టుప్రక్కల గుండె పోటుకు గురైన వారికి వైద్య సహాయం అందేలోపు మనమే సిపిఆర్ చేసి బ్రతికించవచ్చని అన్నారు. సిపిఆర్‌లో గుండె పై ఒత్తిడి చేయడం, శ్వాస ఇవ్వడం ద్వారా రక్త ప్రసరణ జరిగి 2,3 రేట్లు బ్రతికే అవకాశముందని అన్నారు.
కాగా ప్రమాద సమయంలో, డెలివరీ సమయంలో రక్తం కావలసి ఉంటుందని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు బాధ్యతగా రక్తదానం చేయవలసినదిగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఒకరికి ప్రాణాధానం చేయాలంటే మరొకరు రక్తం దాన చేయవలసి ఉంటుందని, ఇప్పుడిప్పుడే ప్రజలలో అవగాహన వస్తున్నదని, స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారని, రక్తదానం చేయడంలో మన జిల్లా ముందున్నదని అన్నారు.
అంతకుముందు జాతీయ రహదారుల అధికారులు, పోలీసులు ట్రాఫిక్ రూల్స్‌పై, వైద్యాధికారులు సిపిఆర్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, ఫిజికల్‌గా వివరించారు. కార్యక్రమంలో ఎఎస్పీ కాజల్, యెల్లారెడ్డి డీఎస్పీ, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ రాజన్న, సిఐలు, ఎస్సైలు, పోలీసులు, వివిధ డాబాలు, హోటల్, పాన్ షాప్ యజమానులు, ప్రజలు పాల్గొన్నారు.