నిజామాబాద్, మే 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేయడం జరిగిందని నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ ఏ.శరత్ వెల్లడిరచారు. ఇంకనూ రైతుల వద్ద నుండి చివరి ధాన్యం గింజను సైతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఈ మేరకు అవసరమైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచుతూ, సంబంధిత అధికారులను సమాయత్తంగా ఉంచామని అన్నారు. మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ తో కలిసి ఇందల్వాయి లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతులను పలుకరించి, ధాన్యం సేకరణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించారు, రైతులకు ఏ మేరకు బిల్లుల చెల్లింపులు జరిగాయని అధికారులను ఆరా తీశారు. ఇందల్వాయి కేంద్రం ద్వారా 8691 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 8459 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల కోసం ట్యాబ్ ఎంట్రీ పూర్తయ్యిందని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ప్రత్యేకాధికారి దృష్టికి తెచ్చారు. మిగతా కొనుగోళ్ళకు సంబంధించి కూడా వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రత్యేక అధికారి శరత్ ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీ సకాలంలో పూర్తయితేనే, రైతులకు వెంటదివెంట బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు.
కాగా, కొనుగోలు కేంద్రానికి కొంత తక్కువ పరిమాణంలో ధాన్యం తెచ్చిన ఓ రైతు ప్రత్యేకాధికారిని కలిసి, గత మూడు రోజుల నుండి తన ధాన్యాన్ని తూకం వేయడం లేదని ఫిర్యాదు చేయడంతో కేంద్రం నిర్వాహకులపై స్పెషల్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు రైతు ధాన్యాన్ని సేకరించి, సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. మిగతా రైతుల ధాన్యం సేకరణలోనూ జాప్యానికి తావులేకుండా చూడాలన్నారు. ఏ ఒక్క రైతు ఇబ్బందికి గురి కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని హితవు పలికారు.
జిల్లాలో ఇంకనూ సుమారు 5500 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం నిల్వలు వచ్చే అవకాశాలు ఉన్నందున, ప్రస్తుతం కొనసాగుతున్న 25 కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రత్యేక అధికారి శరత్ ఆయా కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. నిజాంసాగర్ చివరి ఆయకట్టు ప్రాంతాలైన పడిగెల్, డొంకేశ్వర్ వంటి చోట్ల వారి నాట్లు వేయడంలో ఆలస్యమైనందున ధాన్యం దిగుబడులు కొంత ఆలస్యంగా వస్తున్నాయని అన్నారు. దీనిని దృష్ఠ్టిలో పెట్టుకుని అలాంటి ప్రాంతాలను మినహాయిస్తూ, మిగితా చోట్ల రెండుమూడు రోజులలో ధాన్యం సేకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట మిల్లులకు తరలించాలని, రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. కాగా, జిల్లాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తెచ్చారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద తహసీల్దార్, ఏ.ఓ, సొసైటీ కార్యదర్శితో పాటు సెంటర్ ఇంచార్జ్ లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, క్షేత్ర స్థాయిలో తాము కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. వీరి వెంట డీఎస్‌ఓ చంద్రప్రకాష్, సివిల్ సప్లైస్ డీ.ఎం జగదీశ్ తదితరులు ఉన్నారు.