కామారెడ్డి, మే 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజనీరింగ్ అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ సింధు శర్మతో కలిసి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడుతూ మానవ తప్పిదాలు, రోడ్డు నిర్మాణంలో కొన్ని లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతూ మృత్యువాత పడుతుండడం భాధాకరమన్నారు.
ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధలను పాటించేలా చూడాలని అన్నారు. జిల్లాలో జాతీయ రహదారి 60 కిలో మీటర్ల మేర ఉందని, దగ్గి, సదాశివనగర్, బిక్నూర్ టోల్ ప్లాజా, ఆర్టీఏ చెక్ పోస్ట్, టేక్రియాల్ తదితర ప్రాంతాలలో తరచుగా రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యవాత పడుతున్నారని అన్నారు. గత సంవత్సరం జిల్లాలో 550 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ప్రమాదాలకు గల కారణాలను క్షుణ్ణంగా తెలుసుకొని, నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రధానంగా బ్లాక్ స్పాట్‌లను గుర్తించడంతో పాటు స్పీడ్ బ్రేకర్లు, రుంబుల్ స్ట్రిప్స్, బ్యారికేడిరగ్, స్టడ్స్, బ్లింకర్స్, కల్వర్టుల వద్ద రేడియం స్టిక్కర్లు, మలుపుల వద్ద సూచిక బోర్డులు, బాణం గుర్తులు, స్పీడ్ గన్‌లు, సి.సి. కెమెరాలు, హైమాక్స్ లైట్లు వంటివి ఏర్పాటు ప్రాంతాలను గుర్తించి తగు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. బై పాస్ రోడ్ నుండి ప్రధాన రహదారి పైకి వచ్చే మార్గంలో స్పీడ్ బ్రేకర్‌లు నిర్మించాలని, అత్యవసర సమయంలో వాహనాలు రహదారి ప్రక్కన ఆపడానికి తగు ఏర్పాటు చేయాలని అన్నారు.
ప్రమాదం జరిగిన గంట సమయం గోల్డెన్ పీరియడ్ అని, తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలని, వెంటిలేటర్‌తో అంబులెన్స్ సిద్ధంగా ఉండాలని, ఆసుపత్రిలో అత్యవసరమైన వైద్య పరికరాలు సిద్ధంగా ఉండాలని వైద్యాధికారులకు సూచించారు. రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు మానవతా దృక్పధంతో బాధితులకు సహాయం చేయాలని, 108 అంబులెన్సు కు కాల్ చేయాలని అన్నారు.
సమావేశంలో ఎఎస్పీ కాజల్, డిఎస్పీ నాగేశ్వర్ రావు, నేషనల్ హైవే రెసిడెంట్ ఇంజనీర్ రామారావు, టోల్ గేట్ ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ కుమార్, ఆర్ అండ్ బి ఈ ఈ రవిశంకర్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్ సింగ్, సేవ్ లైఫ్ ఫౌండేషన్ సినియర్ అసోసియేట్ నూర్ ఖేతార్ పాల్ తదితరులు పాల్గొన్నారు.