ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై కలెక్టర్‌ సుదీర్ఘ సమీక్ష

నిజామాబాద్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితో పాటు, బోధన్‌, ఆర్మూర్‌ హాస్పిటళ్ళ పనితీరుపై కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కూలంకషంగా చర్చించారు.

స్థానిక జీజీహెచ్‌ ఆసుపత్రిలో ఆయా విభాగాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సమస్యలను పరిశీలించిన జిల్లా పాలనాధికారి, సూపరింటెండెంట్‌ ఛాంబర్‌ లో వైద్యాధికారులు, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో విభాగం వారీగా ఆయా ఆసుపత్రులలో నెలకొని ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలను మెరుగుపర్చేందుకు అవసరమైన సదుపాయాలు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత, డాక్టర్ల ఖాళీల భర్తీ గురించి ఆయా విభాగాల అధిపతులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.

ఆసుపత్రుల్లో రోగులు, వారి వెంట ఉండే అటెండెంట్ల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జీజీహెచ్‌ లో ప్రతి రోజు సగటున అవుట్‌ పేషంట్లు ఎంత మంది వస్తున్నారు, ఆసుపత్రిలో ఇన్‌ పేషేంట్లుగా చేరుతున్న వారి సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా, వివిధ విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయి తదితర అంశాలను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.

అనునిత్యం సుమారు 1000 నుండి 2000 మంది వరకు ఓ.పీ నమోదవుతుండగా, ప్రతిరోజూ సగటున 100 నుండి 300 మంది వరకు ఇన్‌ పేషంట్లు ఆసుపత్రిలో అడ్మిట్‌ అవుతున్నారని అన్నారు. రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా జీజీహెచ్‌ లో ఉచితంగా కీలు మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామని, 2023 సంవత్సరంలో 83 సర్జరీలు చేశామని తెలిపారు. సిజీరియన్‌ కాన్పులను 75 శాతం నుండి 35 శాతానికి తగ్గిస్తూ సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేస్తున్నామని అన్నారు.

అయితే ఆప్తాల్మిక్‌ వంటి పలు విభాగాలలో వైద్యుల కొరత నెలకొని ఉందని, ఇతర విభాగాల్లోనూ టెక్నీషియన్లు, సిబ్బందిని భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్‌ కు నివేదించారు. ఎం.ఆర్‌.ఐ, అదనంగా మరో ఐదు ఎక్స్‌ రే యంత్రాలు అందుబాటులో ఉంటే రోగులకు సత్వరమే మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని తెలిపారు. కాగా, అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ సూచించారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇందిర, ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »