ప్రభుత్వ పాఠశాలలు … ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

నిజామాబాద్‌, మే 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొని ఉండే అపనమ్మకం క్రమేణా దూరమవుతోంది. ఆర్ధిక స్థోమత లేని పేద కుటుంబాలకు చెందిన పిల్లలే ప్రభుత్వ బడులలో చదువుతారనే భావన చెరిగిపోతూ, ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మధ్య తరగతి వారితో పాటు, సంపన్న శ్రేణికి చెందిన అనేక కుటుంబాలు సైతం తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు ట్రిపుల్‌ ఐ.టీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ప్రవేశాలు లభిస్తుండడం, జవహర్‌ నవోదయ విద్యాలయాలలో చదువుకునే అవకాశం లభిస్తుండడం అందరినీ ఆలోచింపజేస్తోంది. నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలు ఏటికేడాది ఉత్తమ ఫలితాలను సాధిస్తుండడం ఈ మార్పునకు కారణం అవుతోంది. ప్రైవేటు బడులకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమ బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులోకి రావడంతో అనేక మంది మొగ్గు చూపుతున్నారు.

హంగు, ఆర్భాటాలతో హడావుడి చేసే ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ బడులు అద్వితీయ ఫలితాలను నమోదు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవలే ప్రకటించిన 2024 పదవ తరగతి వార్షిక ఫలితాలలో సర్కారీ బడులలో చదివిన విద్యార్థిని, విద్యార్థులు ప్రైవేటు పాఠశాల సైతం విస్తూపోయేలా తమ సత్తా చాటారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ ఒక్క జిల్లా నుండే ఏకంగా 103 మంది బాలబాలికలు 10/10 జీ.పీ.ఏ సాధించడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా మెరుగుపడిన విద్యా ప్రమాణాలకు ఈ ఫలితాలు తార్కాణంగా నిలిచాయి.

మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్ళు, మైనారిటీ రెసిడెన్షియల్‌ బడులలో చదివిన అనేకమంది బాలబాలికలు 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించి సత్తా చాటారు. అన్నింటికి మించి రెసిడెన్షియల్‌, ఆదర్శ పాఠశాలలే కాకుండా ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైతం 10/10 గ్రేడ్‌ పాయింట్స్‌ సాధించి సర్కారీ బడుల ఖ్యాతిని చాటారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో మౌలిక వసతుల కల్పన పనులను చేపట్టి అన్ని సౌకర్యాలను మెరుగుపర్చడం, ఉపాధ్యాయుల బోధనా సామర్ధ్యం పెంపుపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తుండడం సత్ఫలితాలు సాధనకు దోహదపడుతోంది. ఉపాధ్యాయులు సైతం సర్కారీ బడులలో నాణ్యమైన విద్యను బోధిస్తూ, విద్యార్థులు స్వచ్చందంగా ప్రవేశాల పట్ల ఆకర్షితులయ్యేలా కృషి చేస్తున్నారు.

అన్ని వసతులతో కూడిన ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు క్రీడలలోనూ భాగస్వామ్యం చేస్తూ, వారి శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతున్నారు. అన్నింటికి మించి పదవ తరగతి విద్యార్థులకు సాధారణ తరగతులతో పాటు స్పెషల్‌ క్లాసెస్‌ నిర్వహిస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధించేలా జిల్లా పాలనాధికారి పర్యవేక్షణలో జిల్లా విద్యా శాఖ ప్రత్యేక కృషిని కొనసాగిస్తుండడం సత్ఫలితాలను అందిస్తోంది.

ప్రభుత్వ బడులలో చదివి 10 జీ.పీ.ఏ సాధించిన విద్యార్థులు వీరే :

బాల్కొండలోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలికల సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదివిన ముదావత్‌ అఖిల, జిందం ప్రీతి, కటకం సాహితీ, కచ్చకాయల సాహితీ, ఆర్మూర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన తలారి షాలిని, చిమన్పల్లి పాఠశాలకు చెందిన పి.అమూల్య, సాలూర ఎం.జె.పీకి చెందిన డి.అపర్ణ, పి.గౌతమి, పి.హర్షశ్రీ, ఎడపల్లి బాలుర రెసిడెన్షియల్‌ స్కూలుకు చెందిన అభ్యుదయ్‌, రాంపూర్‌ పాఠశాలలో చదివిన డి.నిశాంత్‌ రెడ్డి, కంజర బాలుర రెసిడెన్షియల్‌ స్కూల్‌ కు చెందిన ఎన్‌.సూరజ్‌ గౌడ్‌, కొండపల్లి కార్తీక్‌, నూత్పల్లి వద్ద గల ఎం.జె.పీ పాఠశాలలో చదివిన చరణ్‌ తేజ, జి.రాఘవేంద్ర, ఎస్‌.గణేష్‌, ఎం.భరణి, తాళ్ల బాలు తేజ, గైని శివచరణ్‌, కంజర ఎం.జె.పి స్కూల్‌ కు చెందిన కె.కార్తీక్‌, ఆర్‌.శ్రీచక్ర, దాస్‌ నగర్‌ లోని ఎం.జె.పిలో చదివిన అంకిత, ముదావత్‌ పల్లవి, గంగుల జీవని, ఎం.మహేశ్వరి, టి.రేణుశ్రీ, పెర్కిట్‌ కేజీబీవీకి చెందిన ఎం.సిరి, ఇందల్వాయి కేజీబీవీలో చదివిన ఏ.సాత్విక, డిచ్పల్లి మోడల్‌ స్కూల్‌ కు చెందిన చాట్ల చందన, మెగావత్‌ పల్లవి, ఎం.అమూల్య, ధర్పల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన లోలం మేఘన, ఎస్‌.అంకిత, అక్షయ, జక్రాన్పల్లి మోడల్‌ స్కూల్‌ లో చదివిన ఎం.మాధురి, మామిడిపల్లి మోడల్‌ స్కూల్‌ లో చదివిన ఆఫియా ఫిర్దోస్‌, సయ్యద్‌ అహ్మద్‌, జక్క వాసవి. వేదశ్రీ, అంకం కీర్తి, రోహిణి, సాయి పునీత్‌, పోచంపాడ్‌ లోని బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదివిన ఏ.వైష్ణవి, బి.వర్షిత, ఎడపల్లి ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన కె.నితీష, రమ్య, బాల్కొండ మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో చదివిన జి.సింధు, కె.సాహితి, ఆలూర్‌ లోని మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కు చెందిన మహమ్మద్‌ షానవాజ్‌, వరుణ్‌, మాలావత్‌ అభిషేక్‌, కె.సంజీవ్‌ కుమార్‌, ఎన్‌.మణికంఠ గౌడ్‌, కేతావత్‌ అన్విత్‌, బాల్కొండ పాఠశాలకు చెందిన ఎన్‌.అభిత, ధర్మారంలోని బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన పి.వనిత, పోచంపాడ్‌ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో చదివిన డి.ఐశ్వర్య, జి.లాస్య, ఎస్‌.అను, మధునయన, ఎం.అనురాధ, చాట్ల అలేఖ్య, ఎస్‌.అనన్య, కంజరలోని బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో చదివిన కె.శ్రీవర్ష, సుద్దపల్లిలోని బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌ కు చెందిన పెద్దోళ్ల మానస, బోర్గామ్‌ జెడ్పి హైస్కూల్‌ కు చెందిన చాట్ల దాక్షాయణి, ముప్కాల్‌ హైస్కూల్‌ లో చదివిన టి.ప్రశాంత్‌, నవీపేట్‌ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముబషీరా నాజ్‌, నబీలా నిషాత్‌, ఆలూర్‌ హైస్కూల్‌ లో చదివిన ఏ.సవిత, జి.భవజ్ఞ, దండు శరణ్య, సాయి మాధుర్య, మగ్గిడి రశ్మిత, ఎస్‌.దేవానంద్‌, ఇస్సాపల్లి హైస్కూల్‌ కు చెందిన లక్ష్మి ప్రసన్న, వేల్పూర్‌ హైస్కూల్‌ కు చెందిన నిశిత, ముప్కాల్‌ హై స్కూల్లో చదివిన కార్తికేయ చారి, రచన, పోచంపాడ్‌ స్కూల్‌ కు చెందిన యుస్రాఖాన్‌, మోతె హైస్కూల్‌ కు చెందిన రామకృష్ణ, బాల్కొండ హైస్కూల్‌ లో చదివిన హర్షిక, కమ్మరపల్లి హైస్కూల్‌ కు చెందిన మొహమ్మద్‌ ఫైజాన్‌, భీంగల్‌ గర్ల్స్‌ హైస్కూల్లో చదివిన కె.అపూర్వ, డొంకేశ్వర్‌ హైస్కూల్‌కు చెందిన లవణ్‌ కుమార్‌, ప్రణవ్‌ తేజ్‌, నిశాంత్‌, తొండాకూర్‌ హైస్కూల్‌ కు చెందిన నాయని ఆకృతి, తల్వేద ఉన్నత పాఠశాలలో చదివిన తేజస్విని, డి.విష్ణువర్ధన్‌, డి.శ్రీజ, ఎస్‌.కృష్ణవి, ఐలాపూర్‌ స్కూల్‌ కు చెందిన కె.సాయికిరణ్‌, మొహమ్మద్‌ నుమాన్‌, పడకల్‌ హైస్కూల్లో చదివిన కె.హర్షిక, జి.శంకర్‌, వెల్మల్‌ హైస్కూల్‌ కు చెందిన టి.శ్రీనిత, ఎం.ఆకాంక్ష, ముచ్కూర్‌ హైస్కూల్‌ విద్యార్థులు కె.శ్రవణ్య, చేగంటి శివాని, ఎం.శ్రీవల్లి 10 జీపీఏ సాధించి తమ ప్రతిభను చాటారు.

ఐ.పీ.ఎస్‌ సాధించడమే లక్ష్యం : సీ.హెచ్‌.అంకిత
(దాస్‌ నగర్‌, మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థిని)

సివిల్స్‌ పరీక్షలు రాసి ఐ.పీ.ఎస్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నా తల్లిదండ్రులు, గురువుల తోడ్పాటుతో తప్పనిసరిగా లక్ష్యాన్ని సాధిస్తానని గట్టి నమ్మకం ఉంది. పదవ తరగతిలో 10 గ్రేడ్‌ పాయింట్స్‌ సాధించడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ప్రస్తుతం ట్రిపుల్‌ ఐ.టీలో సీటు సాధించడంపై దృష్టి పెట్టాను.

పాఠశాలలో చక్కటి ప్రణాళికతో, అర్ధమయ్యే విధంగా బోధన చేయడం అత్యుత్తమ మార్కుల సాధనకు దోహదపడిరది. ఖో-ఖో, అథ్లెటిక్స్‌ లోనూ చక్కటి ప్రవేశం ఉండేలా తీర్చిదిద్దారు. తన ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు ఐ.ఐ.టీ తరగతులను అదనంగా బోధించే పఠాన్‌ చెరు, ఇంద్రేశం వద్ద గల ఎం.జె.పీలో తనను రెండేళ్ల పాటు చదివించారు. పదవ తరగతి పరీక్షలను తిరిగి దాస్‌ నగర్‌ పాఠశాల నుండే రాశాను. ఇదే స్పూర్తితో ముందుకెళ్తూ, తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తెస్తాను.

తల్లిదండ్రుల కలను సాకారం చేస్తా : దాక్షాయణి,

( బోర్గాం, జెడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాల విద్యార్థిని)

తాను గొప్ప ఇంజనీర్‌ అయి తల్లిదండ్రుల కలను సాకారం చేస్తాను. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే అనుకున్న గమ్యాన్ని సాధించవచ్చు. ఈ దిశగా కీలకమైన పదవ తరగతి వార్షిక పరీక్షల్లో 10 గ్రేడ్‌ పాయింట్స్‌ సాధించడం ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది.

ఉపాధ్యాయులు అంకిత భావంతో పాఠ్యాంశాలు బోధిస్తూ, క్రమశిక్షణను అలవర్చడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. తన తండ్రి ఆటో డ్రైవర్‌, తల్లి గృహిణిగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. భవిష్యత్తులో ఇంజనీర్‌ అయి వారికి చేయూతగా నిలుస్తాను.

జ్యోతిబాపూలే విద్యా సంస్థలోనే ఇంటర్‌ ప్రవేశం తీసుకున్నాను : జీవని
(దాస్‌ నగర్‌, ఎం.జె.పీ పాఠశాల విద్యార్థిని)

చక్కటితో ప్రణాళికతో బోధనను అందిస్తున్న దాస్‌ నగర్‌ వద్ద గల మహాత్మా జ్యోతిబాపూలే విద్యా సంస్థలోనే ఇంటర్మీడియట్‌ కోసం అడ్మిషన్‌ తీసుకున్నాను. ఇక్కడి ఉపాధ్యాయులు అర్ధమయ్యే రీతిలో బోధన చేయడమే కాకుండా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ, చక్కటి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు.

నూటికి నూరు శాతం సిలబస్‌ ను పూర్తి చేసి, పరీక్షలకు ముందు పునఃశ్చరణ తరగతులు నిర్వహించడం, ఎలాంటి ఒత్తిడికి లోను చేయకుండా పాఠాలను సులభంగా ఆకళింపు చేసుకునేలా తర్ఫీదును ఇవ్వడం వల్ల పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదపడిరది. వసతి, సదుపాయాల విషయంలోనూ ఎలాంటి లోటు లేకుండా ఇంటి వాతావరణాన్ని మరిపించారు. ఇప్పటికైతే మంచి మార్కులతో ఇంటర్‌ పూర్తి చేశాక, బీ.టెక్‌ చేయాలని నిర్ణయించుకున్నాను.

ఐ.ఐ.టీ లో సీటు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తా : పల్లవి
(దాస్‌ నగర్‌, ఎం.జె.పీ పాఠశాల విద్యార్థిని)

వ్యవసాయ కుటుంబ నేపధ్యం కలిగిన తాను ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఐ.ఐ.టీలో సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. బాసరలోని ట్రిపుల్‌ ఐ.టీలో చదువుతున్న మా అన్నను స్ఫూర్తిగా తీసుకుని ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను.

పదవ తరగతిలో 10 గ్రేడ్‌ పాయింట్స్‌ రావడానికి పాఠశాలలో ఉపాధ్యాయులు అందించిన బోధన ఎంతగానో దోహదపడిరది. అన్ని వసతులను అందుబాటులో ఉంచుతూ, ప్రణాళికాబద్ధంగా పాఠాలను బోధించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ఇదే స్పూర్తితో ముందుకెళ్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని పూర్తి నమ్మకం ఉంది.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »