నిజామాబాద్, మే 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిబంధనలను పక్కాగా పాటిస్తూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సీఎంసీ కళాశాలలో జూన్ 4న చేపట్టనున్న నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు.
కౌంటింగ్ నిర్వహణ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన పద్దతులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఎలా చేయాలి, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ఎలా చేపట్టాలి అనే అంశాలపై సంబంధిత అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా శిక్షణ అందించారు. పలువురు కౌంటింగ్ సిబ్బంది వ్యక్తపరిచిన సందేహాలను మాస్టర్ ట్రైనర్లు నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకోవాలని, రాండమైజేషన్ జరిపిన మీదట ఆ జాబితాను అనుసరిస్తూ వారికి ఆయా నియోజకవర్గాల వారీగా టేబుళ్లను కేటాయించడం జరుగుతుందన్నారు.
ఓట్ల లెక్కింపు కోసం నిజామాబాద్ అర్బన్, రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 20 టేబుళ్లు, మిగతా ఐదు నియోజకవర్గాలకు 18 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా సిబ్బంది అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎక్కడ కూడా సమయం వృధా చేయకూడదని, అదే సమయంలో పొరపాట్లకు ఆస్కారం ఉండకుండా పూర్తి అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను అభ్యర్థులు, వారి ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
ఈవీఎం ల ఓట్లను ఒక్కో రౌండ్ వారీగా జాగ్రత్తగా లెక్కిస్తూ, ప్రతి రౌండ్ కు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు వచ్చి సరిచేస్తారని, కౌంటింగ్ ప్రక్రియను యధాతథంగా కొనసాగించాలని తెలిపారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందితో పాటు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వివిధ కార్యకలాపాల నిర్వహణ కోసం నియమించబడిన ప్రతి ఒక్కరూ వారివారి విధులను అంకితభావంతో నిర్వర్తించాలని, అనుమానాలకు, గందరగోళాన్ని తావిచ్చేలా వ్యవహరించకూడదని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు అనుమతించబడవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే సహాయ రిటర్నింగ్ అధికారులను సంప్రదించి వారి దృష్టికి తేవాలని అన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ సూపర్వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్ సెంటర్ లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని, సిబ్బందికి అల్పాహారం, భోజనాల కోసం కూడా తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు.
ఎలాంటి గందరగోళానికి తావులేకుండా పక్కాగా నిబంధనలను పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. శిక్షణ తరగతులలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, డీపీఓ చక్రవర్తి తరుణ్ కుమార్, సహాయ రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.