నిజామాబాద్, మే 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఆయా పార్లమెంటు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా చేపట్టాల్సిన చర్యల గురించి సీఈఓ సూచనలు చేశారు.
మలి విడత ర్యాండమైజేషన్ జరిపి, ఆ జాబితాను అనుసరిస్తూ కౌంటింగ్ సిబ్బందిని కేటాయించాలని అన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 6 గంటల వరకు అందరూ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకునేలా చూడాలని, ఈ మేరకు అభ్యర్థులు, వారి తరఫున హాజరయ్యే ఏజెంట్లకు కూడా సమాచారం అందించాలని సూచించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును ప్రారంభించాలని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని సదుపాయాలు కౌంటింగ్ సెంటర్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యంగా విద్యుత్ అంతరాయం తలెత్తకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని, జనరేటర్ ను సైతం అందుబాటులో ఉంచాలని సూచించారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు మినహా ఇతరులు ఎవరూ కౌంటింగ్ కేంద్రం లోనికి సెల్ ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, అవసరమైన పక్షంలో రీకౌంటింగ్ నిర్వహణ గురించి సిబ్బందికి శిక్షణ తరగతుల సందర్భంగా స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు.
ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా, సాఫీగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పంపించాలని, రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిరచే సమయంలో తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. సీ.సీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు జరగాలని, కౌంటింగ్ సెంటర్ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. తుది ఫలితాల వెల్లడి తరువాత కౌంటింగ్ సెంటర్ వద్ద పక్కాగా ఆంక్షలు అమలయ్యేలా చూడాలని, పూర్తి స్థాయిలో నిబంధనలకు లోబడి సంబరాలు నిర్వహించుకునేందుకు మాత్రమే అనుమతించాలని అన్నారు.
ఎలాంటి అనుమానాలు, వివాదాలు, గందరగోళానికి తావులేకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, సహాయ రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.