కామారెడ్డి, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులతో పాటు మునిసిపల్ ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన ప్రాంతాలలో వేగనిరోదానికి స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్, బ్లింకర్ లైట్లు, కల్వర్టుల వద్ద, అండర్ పాస్‌ల వద్ద రేడియం స్టిక్కర్లు, టి ఎండ్ గల రోడ్ ప్రాంతాలలో సైన్ బోర్డులు, హైమాక్స్ లైట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు.
గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఎస్పీ సింధు శర్మ, ట్రైనీ ఏఎస్పీ కాజల్‌లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 శాతం మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నా వ్య్వవస్థను నిందిస్తున్నారని, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా పాటించి ప్రమాదాలు తగ్గేలా చూడాలన్నారు.
ప్రధానంగా జంక్షన్లు, యు టర్న్ లు, పాదాచారులు రోడ్డు దాటేటప్పుడు, వేగంగా వెళ్లడం, రాంగ్ సైడ్‌లో డ్రైవ్ చేయడం, చిన్న, పెద్ద రోడ్లు కలిసే ప్రాంతాలు, వెలుతురు సరిగా లేని ప్రాంతాలలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామని అన్నారు. ఇట్టి ప్రమాదాల నివారణకు గాను రోడ్డు భద్రతా మార్గదర్శకాలకనుగుణంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజనీరింగ్ అధికారులు, మునిసిపాల అధికారులు, గ్రామా ప్రత్యేకాధికారులు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్డు ప్యాచ్ వర్క్‌లు ఎప్పటికప్పుడు చేపట్టాలని, రోడ్డు వెంట ముళ్ళ పొదలు, చెట్ల పొదలు తొలగిస్తూ మలుపుల వద్ద సూచిక బోర్డులు, బాణం గుర్తులు ఏర్పాటు చేయాలన్నారు. వన్యప్రాణులకు హాని కలగకుండా పొలిసు, అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదం జరిగిన గంట సమయం గోల్డెన్ పీరియడ్ అని, తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలని, వెంటిలేటర్‌తో అంబులెన్స్ సిద్ధంగా ఉండాలని, ఆసుపత్రిలో అత్యవసరమైన వైద్య పరికరాలు సిద్ధంగా ఉండాలని వైద్యాధికారులకు సూచించారు.
అంబులెన్సు వచ్చే వరకు క్షతగాత్రునికి తగు ప్రథమ చికిత్స అందేలా పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది శిక్షణ పొంది ఉండాలన్నారు. ప్రమాద బాధితులను కాపాడే నిమిత్తం అవసరమైన వస్తువుల కొనుగోలుకు, రక్తదానానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జాతీయ ప్రాధికార సంస్థ అధికారులు సి.ఎస్.రావు, భరత్, ఆర్ అండ్ బి ఈ ఈ రవి శంకర్, డిఎమ్ అండ్ హెచ్ ఓ చంద్రశేఖర్, ఆర్.టి.ఏ. శ్రీనివాస్ రెడ్డి, జిఎంఆర్ హైవేస్ లక్ష్మణ్ రావు, వెంకట రమణ, ఎంహెచ్ పీఎల్ అధికారులు ప్రభాకర్ రెడ్డి, ఖాజామొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు..