కామారెడ్డి, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా భవన, ఇతర నిర్మాణ వ్యయంలో ఒక శాతం సెస్ కార్మిక శాఖకు చెల్లించవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం అమలుపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించే భవన, ఇతర నిర్మాణ వ్యయంలో ఒక శాతం సెస్ వసూలు చేసి కార్మిక శాఖకు చెల్లించవలసి ఉంటుందన్నారు.
కాంట్రాక్ట్ లేబర్ ఆక్ట్ అండ్ అంతరాష్ట్ర కార్మిక చట్టం ప్రకారం పనులు నిర్ణయించే అధికారులు ప్రిన్సిపాల్ ఎంప్లాయర్‌గా వ్యవహరిస్తారని, వారు తప్పనిసరిగా కార్మిక శాఖలో పేరు నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలని అన్నారు. జిల్లాలో మునిసిపల్ కమీషనర్లు, పంచాయతి రాజ్ శాఖ అధికారులు ప్రైవేట్ భవన, ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇచ్చునప్పుడు నిర్మాణ ఖర్చులో తప్పనిసరిగా ఒక శాతం సెస్ వసూలు చేసి కార్మిక శాఖకు డిపాజిట్ చేయాలని కలెక్టర్ చెప్పారు.
ఇట్టి సెస్ డబ్బులు కార్మిక సంక్షేమం కోసం ఉపయోగపడుతుందన్నారు. కాగా భవన, ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు కార్మిక శాఖ నుండి గుర్తింపు కార్డు తీసుకుంటేనే ఇది వర్తిస్తుందన్నారు.
సమావేశంలో సహాయా కార్మిక కమీషనర్ కోటేశ్వర్లు, పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు రఘునాథ్ రావు, సిపిఒ రాజారామ్, ఆర్ అండ్ బి ఈ ఈ రవిశంకర్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.