కామారెడ్డి, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించుటకు జూన్ 3 నుండి 11 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంలో అందరు భాగస్వాములై విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జూన్ 3 నుండి 11 వరకు చేపట్టనున్న బడిబాట, అనంతరం జూన్ 12 నుండి 19 వరకు రోజువారీ చేపట్టనున్న కార్యక్రమాలపై ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శాకలను అధికారులకు వివరించి సమర్థవంతంగా అమలుచేయుటకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 3 నుండి 11 వరకు చేపడుతున్న బడిబాట కార్యక్రమాలలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, తహసీల్ధార్లు, ఎంపిపిలు, ఎంపిఓలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను, స్వయం సహాయక సంఘాలు, విలేజి ఆర్గనైజేషన్లు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ తమ పరిధిలోని గ్రామాలలో చదువుకు దూరంగా ఉంటున్న బడిఈడు పిల్లలను గుర్తించి దగ్గరలోని అంగన్వాడీలు, పాఠశాలలో చేర్పించాలన్నారు.
ప్రధానంగా ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠాశాలలో ఉన్న వ్యత్యాసం, ఖర్చు చెప్పి ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమమని తల్లిదండ్రులలో వారిలో నమ్మకం కలిగించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలు దీటుగా ప్రభుత్వ బడులలో మౌలిక వసతులు కల్పిస్తూ డ్యూయల్ డెస్క్ లు, డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారని, పాఠశాలలు మనకు ఆంద్ఫ్బాటు దోరంలో ఉంటాయని, అక్కడ ఉన్నత చదువులు చదివి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారని, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు బుక్లు, దుస్తులు ఇస్తారని, నాణ్యమైన భోజనం పెడతారని, ఒక్క పైసా ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదని, పూర్తిగా ఉచిత విద్య లభిస్తుందని, ప్రభుత్వ బడులలో చదువుకున్న వారే ఉన్నత స్థానాలలో ఉన్నారన్న విషయం తల్లిదండ్రులకు చెప్పాలన్నారు.
ఇక ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్, డిగ్రీ చేసిన ఉపాధ్యాయులు ఉంటారని, దూరంగా ఉండే పాఠశాలకు స్కూల్ బస్సులో వెళ్లాలని, పుస్త్తకాలు,దుస్తులు అన్ని కొనవలసి ఉంటుందని, నెల నెలా ఫీజు చెల్లించవలసి ఉంటుందని అయినా పిల్లల భవిష్యత్తు గ్యారంటీ ఉంటుందన్న నమ్మకం లేదని, అవే డబ్బులను ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే పిల్లల ఉన్నత చదువులకు వస్తాయని వివరించాలన్నారు.
జూన్ 3 న బడిబాట కార్యక్రమంపై విలేజి ఆర్గనైజేషన్లతో సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల నమోదుకు చర్యలు తీసుకోవాలన్నారు. 4న ఇంటింటికి తిరిగి బడిఈడు పిల్లలను గుర్తించాలన్నారు. 5 నుండి 10 వరకు అంగన్వాడీ కేంద్రాలకు సందర్శించి తలిదండ్రులలో చదువుపట్ల అవగాహన కలిగించి పిల్లలను బడికి పంపేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 11 న గ్రామ సభ ఏర్పాటు చేసి 3 నుండి 10 వరకు చేపట్టిన కార్యక్రమాలను చర్చించాలన్నారు.
12 న పండుగ వాతావరణంలో పాఠశాలు పున :ప్రాంరంబించి నూతన విద్యార్థులకు స్వాగతం పలకాలన్నారు. 13 న తొలిమెట్టు, 14 న సామూహిక అక్షరాబ్యాసం, 15 న గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, 18 న డిజిటల్ తరగతులపై అవగాహన, 19 న ఆటలపోటీలు నిర్వహించాలన్నారు. చక్కటి కార్యాచరణతో పక్కాగా ప్రణాళిక రూపొందించి అధికారులందరూ సమన్వయంతో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో డీఈఓ రాజు, లింగం, పంచాయత్ రాజ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.