నిజామాబాద్, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికే ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
డిచ్పల్లి మండలం అమృతాపూర్ క్యాంప్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో పాటు, జక్రాన్పల్లి మండలం అర్గుల్, లక్ష్మాపూర్ గ్రామాల్లోని ప్రైమరీ స్కూళ్లను, మునిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి పనులను నిశితంగా పరిశీలన జరిపారు. కిచెన్ షెడ్లు, టాయిలెట్స్, ఫ్లోరింగ్, తరగతి గదులు, పైకప్పు, డిజిటల్ క్లాస్ రూమ్ లు, నీటి సంపు, వాటర్ ట్యాంక్ తదితర వాటిని పరిశీలించారు.
మంజూరైన వాటిలో ఇప్పటివరకు ఎన్ని పనులను పూర్తి చేశారు, ఎన్ని నిధులు వెచ్చించారు, ఇంకా ఎన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలలో కొనసాగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో వారం, పది రోజులలోపు ఏ ఒక్క పని పెండిరగ్ లేకుండా పూర్తి చేయించాలని అన్నారు.
పాఠశాలల ఆవరణలో మురుగు జలాలు, వర్షపు నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, ఎక్కడ కూడా రాజీ పడవద్దని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. విద్యార్థుల ప్రయోజనాలతో ముడిపడిన పనులు అయినందున నాణ్యతా ప్రమాణాలు పాటించాలని హితవు పలికారు. పెచ్చులు ఊడిన పైకప్పుకు కెమికల్ ట్రీట్మెంట్ చేసిన మీదట పూర్తి స్థాయిలో మరమ్మతులు జరిపించాలని, లీకేజీలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి బడిలో విద్యార్థిని, విద్యార్థులకు రక్షిత మంచి నీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. బడుల పునః ప్రంరభానికి ముందే జిల్లా వ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ పాఠశాలలను గ్రామ పంచాయతీ కార్మికుల సహాయంతో శుభ్రం చేయించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, డీఈఓ దుర్గాప్రసాద్, మండల ప్రత్యేక అధికారి యోహాన్, పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్ తదితరులు ఉన్నారు.