నిజామాబాద్, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారత వాయు సేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్)లో అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేయబడినదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అర్హులైన యువతీ, యువకులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ గురుప్రీత్ అత్వాల్, నాన్ కమిషన్డ్ ఆఫీసర్ సందీప్ గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా పాలనాధికారిని కలిసి అగ్నివీర్ వాయు నియామక ర్యాలీ వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) పోస్టుల భర్తీ కోసం భారత వాయు సేన వచ్చే జూలై నెలలో నియామక ర్యాలీ నిర్వహించనుందని తెలిపారు. కాన్పూర్, బెంగుళూరు నగరాలలో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందని వివరించారు. పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండి, 2004 జనవరి 02 నుండి 2007 జూలై 02 తేదీ మధ్యన జన్మించిన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులని సూచించారు.
ప్రత్యేకంగా మ్యూజీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నందున పియానో, గిటార్, వయోలిన్, శాక్సోఫోన్, తబలా వంటి సంగీత, వాద్య పరికరాలలో ఏదైనా ఒకదానిలో ప్రావీణ్యం కలిగి ఉన్న సంగీతకారులు మాత్రమే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన వారు జూన్ 05 వ తేదీ లోపు https;//agnipathvayu.cdac.in/ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న వారికి భారత వాయుసేన నుండి ఆన్ లైన్లో తాత్కాలిక అడ్మిట్ కార్డు జారీ చేయబడుతుందని తెలిపారు. రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన తేదీ, సమయం, వేదిక తదితర వివరాలను అడ్మిట్ కార్డులో పొందుపరుస్తారని అన్నారు. అడ్మిట్ కార్డు కలిగిన వారిని మాత్రమే రిక్రూట్మెంట్ ర్యాలీకి అనుమతిస్తారని అన్నారు. జిల్లాకు చెందిన అర్హులైన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కాగా, అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) పోస్టుల నియామకం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయమై విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వాయుసేన అధికారులతో భేటీ అయిన వారిలో కలెక్టర్ తో పాటు, జెడ్పి సీఈఓ ఉష, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎస్.శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న తదితరులు ఉన్నారు.