నిజామాబాద్, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వానాకాలం పంట సాగుకు సంబంధించి రైతులకు 60శాతం సబ్సిడీపై జీలుగ (పచ్చిరొట్ట) విత్తనాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 66 కొనుగోలు కేంద్రాలకు గురువారం నాటికి 6155.2 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటికే 5564.1 క్వింటాళ్ల విత్తనాలను 60 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ చేశారని కలెక్టర్ వివరించారు.
జిల్లా రైతాంగం అవసరాలకు సరిపడా జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామని, రైతుల నుండి వచ్చే డిమాండ్ కు అనుగుణంగా ఆయా మండలాలకు జీలుగ విత్తనాలు కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. జీలుగ విత్తనాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు లోను కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు.
జిల్లాలో నకిలీ విత్తన విక్రయాలను నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. నకిలీ విత్తన విక్రయాలపై నిఘా ఉంచి, బాధ్యులపై కఠిన చర్యలు చేపడుతున్నామని అన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాల విషయమై వ్యవసాయ విస్తరణాధికారులు, ఇతర వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో రైతులకు చైతన్యపరుస్తున్నారని, నకిలీ విత్తనాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
మండల స్థాయిలో వ్యవసాయం, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో కూడిన తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి, ఎరువులు, విత్తన విక్రయ కేంద్రాలను తనిఖీ చేయిస్తున్నామని, రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.
తనిఖీల్లో భాగంగా 29.05.2024న, ఆర్మూర్ మండల బృందం సుర్బిర్యాల్ గ్రామంలో అనధికార స్థలంలో నిల్వ చేసిన వరి (5540 కిలోలు), మొక్కజొన్న (360 కిలోలు), సోయాబీన్ (810 కిలోలు) విత్తనాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారని కలెక్టర్ వివరించారు అదేవిధంగా,28.05.2024న, ఆర్మూర్‌లోని బాలాజీ సీడ్స్, పెస్టిసైడ్స్ నుండి రూ. 14,825 విలువైన గడువు ముగిసిన కూరగాయలు మరియు ఉల్లి విత్తనాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకుని, సెక్షన్ 420 ఐపిసి కింద కేసు నమోదు చేశారని తెలిపారు.
కాగా, రైతులు అధీకృత విత్తన డీలర్ల నుండి మాత్రమే విత్తనాన్ని కొనుగోలు చేయాలని, విత్తనాన్ని కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు / ఇన్‌వాయిస్ తీసుకోవాలని సూచించారు. బిల్లు / ఇన్‌వాయిస్‌లో రైతు పేరు, పంట పేరు, వెరైటీ పేరు, లాట్ నంబర్ తదితర వివరాలు ఉండేలా చేసుకోవాలన్నారు.
పంట కోసే వరకు రైతులు బిల్లు/ఇన్‌వాయిస్ ను, ఖాళీ విత్తన సంచిని తమ వద్ద భద్రపరచుకోవాలని, అది విత్తనం నకిలీదని తేలితే సాక్ష్యంగా పనిచేస్తుందని కలెక్టర్ సూచించారు.