కామారెడ్డి, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వానాకాలం పంటసాగుకు సంబంధించి అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా విత్తనాల కొరత లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శుక్రవారం బిక్నూర్ మండలంలోని విత్తన పంపిణి కేంద్రాలను, పెస్టిసైడ్స్ దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.
ముందుగా పిఎసిసిఎస్ లోని దయించ స్టాక్ పాయింట్, రైతువేదికలో పర్మిట్ ఇష్యూ , బిల్ జనరేషన్ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు 60 శాతం సబ్సిడీపై జీలుగ (పచ్చిరొట్ట) విత్తనాలు పంపిణి చేస్తున్నామన్నారు. జిల్లా రైతాంగం అవసరాలకు సరిపడా జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
రైతుల నుంచి వచ్చే డిమాండ్ కు అనుగుణంగా ఆయా మండలాలకు జీలుగ విత్తనాలను కేటాయిస్తున్నామన్నారు. జీలుగ విత్తనాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని అన్నారు. అనంతరం బిక్నూర్‌లోని లక్ష్మి సీడ్స్, మహాన్వి సీడ్స్ దుకాణాలను తనిఖీ చేశారు. పత్తి, వరి విత్తనాలు స్టాక్ ఎంతవచ్చింది, ఎలా పంపిణి చేస్తున్నారు, రైతువారీగా, విత్తన రకం వారీగా రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామాని హెచ్చరించారు. నకిలీ విత్తనాల పట్ల వ్యవసాయాధికారులు రైతులకు అవహగాహన కలిగించాలని, రైతులు కూడా నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తప్పక బిల్లు తీసుకోవాలన్నారు.