నిజామాబాద్, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలోని బోధన్ పట్టణంలో గల ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ నిల్వలలో తేడా, ఇతర వివరాల నమోదులో లోటుపాట్లు కలిగిన ఓ దుకాణ డీలర్ పై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువుల కారణంగా ఎక్కడ కూడా ఏ ఒక్క రైతు నష్టపోకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ అధికారులను సమన్వయము చేసుకుని రెండు రోజుల్లోపు అన్ని దుకాణాలలో క్షుణ్ణంగా తనిఖీలు పూర్తిచేసి తనకు నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ముందుగా బోధన్ పట్టణం అంబెడ్కర్ చౌరస్తాలో గల ఏ.వీ.నారాయణ రావు అండ్ కంపెనీ ఎరువులు, విత్తనాల షాపును తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్ లను, విత్తన బస్తాలపై లాట్ నంబర్, ఎం.ఆర్.పీ రేటు, బ్యాచ్ నెంబర్, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించారు. ఎరువులు, విత్తన అమ్మకాలకు తగిన అనుమతులు పొందిన పత్రాలను పరిశీలించి, దుకాణదారులకు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శ్రీనివాస్ అండ్ కంపెనీ విత్తన, ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ లో, ఈ-పాస్ నమోదు వివరాలలో తేడా ఉండడాన్ని గుర్తించిన కలెక్టర్, ఈ విషయమై డీలర్ ను ప్రశ్నించగా సరైన సమాధానం రాలేకపోయింది. అంతేకాకుండా స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్ లో వివరాల నమోదులోనూ లోటుపాట్లు ఉండడాన్ని గమనించిన కలెక్టర్, శ్రీనివాస్ అండ్ కంపెనీ దుకాణంపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
నకిలీ ఎరువులు, విత్తన విక్రయాలను ఎంతమాత్రం సహించేది లేదని, రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా విత్తన అభివృద్ధి సంస్థ అధికారి శ్రీకర్, ఇంచార్జి ఏడీఏ సంతోష్ తదితరులు ఉన్నారు.
పాఠశాలల్లో ప్రగతి పనుల పరిశీలన
కాగా, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ బడులలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఏ.ఆర్.పీ క్యాంప్ లోని ప్రైమరీ స్కూల్, బోధన్ పట్టణం బురుడ్ గల్లీ లో గల ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించి, ఆయా దశలలో కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పనులు నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ జరపాలని అధికారులకు సూచించారు. అత్యవసర పనులను గుర్తిస్తూ, యుద్ధప్రాతిపదికన వాటిని పూర్తి చేయించాలన్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి అన్ని పనులు పూర్తి చేయించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బడులను, వాటి పరిసరాలను శుభ్రం చేయించాలని అన్నారు.
వర్షాకాలం సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా, వర్షపు జలాలు, మురుగు నీరు పాఠశాల ఆవరణలో నిలువ ఉండకుండా ముందస్తుగానే జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.దుర్గాప్రసాద్, ఈ.ఈ దేవిదాస్ తదితరులు ఉన్నారు.