కామారెడ్డి, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశమందిరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవతరణ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని వేడుకల్లో భాగస్వాములను చేయాలన్నారు. గ్రామాలలో సర్పంచుల పదవీకాలం ముగిసినందున ప్రత్యేకాధికారులు పతాకావిష్కరణ చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా చూడాలన్నారు. ఒక్క కలెక్టరేట్ మినహా అంతటా ఉదయం 9 గంటల లోపు పతాకావిష్కరణ జరగాలన్నారు.
కామారెడ్డి పట్టణంలోని హోసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉదయం 8.30 గంటలకు జిల్లా కలెక్టర్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం సరిగ్గా 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ గావిస్తారన్నారు. పిమ్మట పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి కలెక్టర్ ప్రసంగిస్తారని ఆయన చెప్పారు.
అమరవీరుల స్థూపం, కలెక్టరేట్‌లోని డయాస్ వద్ద అందమైన పూలతో, జూన్ 1,2 తేదీలలో కలెక్టరేట్‌ను మూడు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. అవార్డుల ప్రధానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవని స్పష్టం చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ రావు, డిఎస్పీ యాకుబ్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ. మసూర్ అహ్మద్, జిల్లా అధికారులు దయానంద్, వరదారెడ్డి, భాగ్యలక్ష్మి, కోటేశ్వర్లు, రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.