కామారెడ్డి, జూన్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వ్యవసాయ క్షేత్రంలో పాంపాడ్ లు నిర్మించుకోవడం ద్వారా అటు వ్యవసాయంతో పాటు ఇటు చేపల పెంపకం చేపట్టి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు సూచించారు. శనివారం కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో ఉపాధి హామీ పధకం క్రింద నిర్మిస్తున్న ఫార్మ్ పాంపాడ్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశిలించారు.
తాను కూడా గడ్డపార చేతబట్టి మట్టిని త్రవ్వుతూ అక్కడ ఉన్న కూలీలలకు ఉత్సాహం కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొర్రమీను చేపలకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉందన్నారు. ఏడాదిలో మూడు సార్లు పాంపాడ్ లో చేప పిల్లల పెంపకం చేపట్టవచ్చని, తద్వారా రైతులకు ఆదాయం సమకూరడంతో పాటు అట్టి నీటిని వ్యవసాయ క్షేత్రానికి తరలించడం ద్వారా రసాయనిక ఎరువులు వేసే అవసరం కూడా ఉండదని అన్నారు.
వ్యవసాయ క్షేత్రాలలో పాంపాడ్ నిర్మించుకోవడానికి ముందుకువచ్చే ఆసక్తి గల సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీతో పాటు సాంకేతిక సలహాలు అందిస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఎంపిఒ మలహరి తదితరులు ఉన్నారు.