నిజామాబాద్, జూన్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఐ.డీ.ఓ.సీలో నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 9.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
అంతకుముందు వినాయకనగర్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. కలెక్టర్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పుర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కలెక్టరేట్‌ను రంగు రంగుల విద్యుద్దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు.
ప్రభుత్వం అట్టహాసంగా ఈ వేడుకలను చేపడుతున్న నేపథ్యంలో మరింత విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.